బచ్చన్నపేట జూన్ 19 : రాష్ట్రంలోని కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులగా తీర్చిదిద్దాలనే మహోన్నత లక్ష్యంతో ఇందిరా మహిళాశక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకనుగుణంగా మహిళా సంఘాల సభ్యులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వివిధ యూనిట్లను ప్రారంభిస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట మండలంలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పోచన్నపేట గ్రామానికి చెందిన రేణుక అనే స్వయం సహాయక సంఘాల సభ్యురాలు రచన మహిళా సమైక్య సంఘం ద్వారా రెండు లక్షల రుణం పొంది వనిత టీ స్టాల్‌ని ఏర్పాటు చేసుకున్నారు.
గురువారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని..జిల్లాలోని ఆయా గ్రామాల్లో అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా బ్యాంక్‌ల నుంచి రుణాలు అందేలా కృషి చేస్తామన్నారు. మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.
ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని, కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ..స్వయం సమృద్ధి సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డిమాండ్‌కి తగ్గట్టుగా బిజినెన్ ని పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వనిత టీ స్టాల్ లో అందరికి కలెక్టర్ టీ ఆర్డర్ చేసి.. బిల్ మొత్తాన్ని యజమాని రేణు కి అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, మండల స్పెషల్ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ మల్లికార్జున్, డిటి ఫణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.