హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ 24వ స్నాతకోత్సవాన్ని ఈనెల 19, 20 తేదీల్లో నిట్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించనుంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ ప్రోగ్రామ్‌లకు చెందిన మొత్తం 1,997 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. శుక్రవారం నిట్‌లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితీష్‌కుమార్, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ వెంకయ్య దరి, రిజిస్ట్రార్ సునీల్‌కుమార్ మెహతాతో కలిసి స్నాతకోత్సవ వివరాలు వెల్లడించారు.
19న అండర్ గ్రాడ్యుయేట్ పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేయనుండగా, 20న పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. రెండురోజుల కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు-930, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు-945, పీహెచ్డీ డిగ్రీలు- 100, ఎగ్జిట్ డిగ్రీలు-22, మొత్తం 1,997 డిగ్రీలు అందుకోనున్నట్లు వివరించారు. టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌కుమార్ ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు, స్నాతకోత్సవానికి నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్ పర్సన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించనున్నట్లు తెలిపారు.