సుబేదారి (వరంగల్) : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడంతో నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో మృతుడు శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించడానికి, కుటుంబ సభ్యులను ఓదార్చడానికి బీఆర్ ఎస్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నర్సంపేట సమీపంలోని శంకర్ స్వగ్రామం ముత్తోజి పేట వెళ్ళడానికి బయలుదేరిన క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు.
వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం పలువురు పోలీసు అధికారులతో కలిసి ముత్తోజి పేటకు వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎవరిని కూడా నర్షంపేట రాకుండా అరెస్టులు చేశారు. హనుమకొండ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు ..
హైదరాబాద్ నుంచి నర్సంపేటకు బయలుదేరిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మలోతు కవిత ను జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని నర్సంపేటకు పంపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అరెస్టు చేశారు.
నర్సంపేటలో ఉద్రిక్తత..
శంకర్ గౌడ్ మృత దేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకురావడానికి అనుమతించాలని మాజీ ఎమ్మెల్యే
పెద్ది సుదర్శన్ రెడ్డి, డిపో కార్మికుల ఆందోళన చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సుదర్శన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి ఉమ్మడి జిల్లా సరిహద్దు దాటి తీసుకెళ్లారు.
ఉమ్మడి జిల్లాలో ఎమర్జెన్సీ వాతావరణం..
ఆర్టీసీ కార్మికుల సమ్మె, డ్రైవర్ అత్యహత్య ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. హనుమకొండ బస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున స్పెషల్ ఫోర్స్ ను పెట్టారు. డీసీపీ, ఇద్దరు ఏసీపీలు,ఐదుగురు ఇంస్పెక్టర్లు బందోబస్తు పర్యవేక్షణ చేస్తున్నారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులను బయకి వెళ్లకుండా పోలీసు అధికారులు అలర్ట్ చేశారు. బస్ స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. ఉమ్మడి జిల్లా పోలీసు యాత్రాగం, 5 బెటాలియన్ బలగాల మొహరింపు తో ఉమ్మడి జిల్లాలో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది.
