నల్లబెల్లి, మే 27 : వానకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న ప్రతి రైతు సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజన్ అన్నారు. ఈ మేరకు నల్లబెల్లి మండలం కన్నారావుపేట రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు అధిక యూరియా వాడకాన్ని నివారించడం, నీటిపారుదల నీటి వినియోగాన్ని తగ్గించడానికి నీటి ఆదా పద్ధతులను వివరించారు.
అలాగే పురుగుమందుల అధిక వాడకంపై అవగాహన కల్పించారు. చెట్ల పెంపకం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వాడకం, నేల సారాన్ని మెరుగుపరచడానికి పచ్చి రొట్ట, బిటి విత్తన పరీక్ష, పంట మార్పిడి, అధిక సాంద్రత కలిగిన పత్తి మొదలైన వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర,వ్యవసాయ అధికారి బి. రజిత, ఏఈవో విశ్వభాను పాల్గొన్నారు.