హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 26 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కాకతీయ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ భూముల పరిరక్షణకు విద్యార్థులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు హరికృష్ణ, మేకల జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వదిలివెళ్లిన యూనివర్సిటీ భూమిని తిరిగి యూనివర్సిటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీకి చెందిన భూములు కబ్జాకు గురి కాకుండా వెంటనే ప్రహరీగోడ నిర్మాణం చేపట్టాలని, కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. యూనివర్సిటీ ఆస్తులను కాపాడటం ప్రతి విద్యార్థి బాధ్యతని, భవిష్యత్తులో కూడా భూముల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జ్ నిమ్మల రాజేష్, సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్, మహేందర్, వేణు పాల్గొన్నారు.