ప్రతి షాపు ఎదుట రెండు డస్ట్బిన్లు.. ఉల్లంఘిస్తే ట్రేడ్ లైసెన్స్ రద్దు
నగరంలో సీజనల్ వ్యాధుల నివారణ కోసం చైతన్య ర్యాలీలు
వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం
వారంలోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు
వరంగల్, ఆగస్టు 20 : మహానగరంలో సీజనల్ వ్యాధులను ఆదిలోనే నివారించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండేలా కార్యాచరణ రూపొందించారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణ, ఫాగింగ్, డ్రైనేజీల్లో స్ప్రే చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ముఖ్యంగా కమర్షియల్ సెక్టార్లలో వ్యాపారులు చెత్తను ఇష్టారాజ్యంగా డ్రైనేజీల్లో వేయకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపర్చేందుకు గ్రేటర్ చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజుల క్రితం హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు గ్రేటర్ ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో గాడి తప్పిన పారిశుధ్య వ్యవస్థను మెరుగుపర్చాలని ఆదేశించారు. వారం రోజుల్లో అంతా చక్కబడాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో గ్రేటర్ అధికారులు పారిశుధ్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా కమర్షియల్ సెక్టార్లలో వ్యాపారస్తులు చెత్తను ఇష్టారాజ్యంగా డ్రైనేజీల్లో వేస్తుండడంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టారు. వారం రోజుల్లో పక్కాగా అమలు జరిగేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు.
షాపుల ఎదుట డస్ట్ బిన్లు
నగరంలోని ప్రతి షాపు ఎదుట రెండు డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకునేలా గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. తడి, పొడి చెత్తల కోసం వీటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు కమర్షియల్ సెక్టార్లో కార్పొరేషన్ చెత్త వాహనం షాపుల నుంచి చెత్త సేకరించేలా కార్యచరణ రూపొందించారు. దీన్ని ఉల్లంఘించి షాపు నిర్వాహకులు చెత్తను డ్రైనేజీల్లో వేస్తే భారీ జరిమానాతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు.
చైతన్య ర్యాలీలు
సీజనల్ వ్యాధుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రేటర్ అధికారులు చైతన్య ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక కార్పొరేటర్‌ను సమన్వయం చేసుకుని కాలనీ కమిటీలు, స్వచ్ఛంద సంస్థ లు, యూత్‌తో ప్రతి కాలనీలో చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాలనీ కమిటీలతో శానిటరీ ఇన్స్పెక్టర్లు కలిసి చర్చించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులతో గ్రేటర్ అధికారులు సమావేశమయ్యారు. రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
ఆకస్మిక తనిఖీలు
గాడి తప్పిన పారిశుధ్య వ్యవస్థ వారం రోజుల్లో మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల సమీక్షలో ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. పారిశుధ్య వ్యవస్థపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని హెచ్చరించారు. దీంతో గ్రేటర్ ప్రజారోగ్య విభాగం సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంటి చెత్త సేకరణతో పాటు సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారిస్తున్నారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
పారిశుధ్య వ్యవస్థ పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైతన్య ర్యాలీలు నిర్వహిస్తాం. ఇందుకు వైద్య శాఖ అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించాం. దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్బన్ మలేరియా సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో నగర పారిశుధ్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం.