రూ.10కోట్లతో అంచనా
కక్కిరాలపల్లిలో ఏర్పాటుకు కసరత్తు
హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే
మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధం
వరంగల్, ఆగస్టు 19: ఇప్పటివరకు చెత్తను శుద్ధి చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చూశాం.. ఇప్పుడు పాత భవన శిథిలాలతోనూ ఆదాయం పొందే దిశగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేస్తున్నది. మహానగరంలో రూ.10కోట్లతో భవన వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంట్ (కన్స్ట్రక్షన్ అండ్ డీమోలిషన్ వేస్ట్) నెలకొల్పేందుకు వడివడిగా చర్యలు చేపడుతున్నది. హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే ఏర్పాటయ్యే ఈ ప్లాంట్ కోసం కక్కిరాలపల్లిలో ఐదెకరాల స్థలం కేటయించింది. మేయర్ గుండు సుధారాణి నేతృత్వంలో మరో మూడు నెలల్లో డీపీఆర్‌ను రూపొందించేందుకు అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
వ్యర్థాలతో ఆదాయం సమకూర్చుకోవాలనే సంకల్పంతో బల్దియా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆహార, కూరగాయల వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్, రూ. 10 కోట్లతో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ (కన్స్ట్రక్షన్ అండ్ డిమోలేషన్ వేస్ట్) ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. సుమారు 10 లక్షల జనాబా, 407 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్న వరంగల్ మహానగరంలో పెద్ద ఎత్తున నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రీ సైక్లింగ్ చేసి సంపద సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఇటీవల పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాంటి ప్లాంట్‌ను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ విషయంపై మేయర్ గుండు సుధారాణి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెండ్రోజుల క్రితం అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఆరు నెలలుగా బల్దియా అధికారులు రీ సైక్లింగ్ ప్లాంట్‌పై కసరత్తు చేస్తున్నారు. దీనిపై ప్రైవేట్ కన్సల్టెన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో డీపీఆర్ రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కక్కిరాలపల్లిలో ఏర్పాటు
కక్కిరాలపల్లి గ్రామంలో సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని బల్దియాకు కేటాయించేందుకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్లాంట్ నిర్మాణానికి బల్దియాలోని ప్రజారోగ్య, పట్టణ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో కసరత్తు చేస్తున్నాయి. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి తోడు రహదారుల విస్తరణలో పాత గృహాలను కూల్చివేస్తున్నారు. వీటి వ్యర్థాలను ఎక్కడ వేయాలో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, బల్దియా ఆధ్వర్యంలో నిర్మాణ వ్యర్థాల నుంచి వేరు చేసిన సిమెంట్, ఇసుక, కంకర, సున్నంతో ఇటుకలు, ఇతర వస్తువులను తయారు చేసి పరిశ్రమలకు విక్రయించనున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థ్యాలను జువేరి సిమెంట్ పరిశ్రమకు అధికారులు విక్రయిస్తున్నారు.
మూడు నెలల్లో ప్రతిపాదనలు
నిర్మాణ వ్యర్థ్యాల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రతిపాదనలు మూడు నెలల్లో రూపొందిస్తాం. కక్కిరాలపల్లిలో స్థలం సిద్ధంగా ఉంది. ప్రతి కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ గ్రేటర్ కార్పొరేషన్లో తొలి ప్లాంట్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రెండో ప్లాంట్ వరంగల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
-సత్యనారాయణ, ఎస్ఈ, బల్దియా