భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూసేకరణ
15వేల ఎకరాలు లక్ష్యం
తొలి దశలో 5వేల ఎకరాలు
ఎనుమాముల ప్రాంతంలో సేకరణకు కసరత్తు
వరంగల్, ఆగస్టు 18 : హెచ్ఎండీఏ తరహాలో గ్రేటర్ వరంగల్‌లో ల్యాండ్‌బ్యాంక్ సిద్ధం చేసేందుకు ‘కుడా’ అడుగులు వేస్తోంది. నగరం రోజురోజుకూ విస్తరిస్తున్న క్రమంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూములను సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఓసిటీ, మాసిటీ వంటి మోడల్ కాలనీలకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ తాజాగా ల్యాండ్‌బ్యాంక్ కోసం 15వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలివ్వగా, ఎనుమాముల సహా పలు ప్రాంతాల్లో సేకరణకు కసరత్తు ముమ్మరం చేసింది.
రోజు రోజుకూ పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ప్రజా అవసరాలకు వినియోగించుకునేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు సిద్ధమైంది. హెచ్ఎండీఏ తరహాలో వరంగల్ నగరంలోనూ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ‘కుడా’ అడుగులు వేస్తున్నది. దీనిపై ఆ సంస్థ’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఇటీవల కలెక్టర్‌ను కలిసి ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఓ సిటీ, మా సిటీ పేరుతో మోడల్ కాలనీలకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయ్యింది. ల్యాండ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గతంలోనే అర్బన్ అథారిటీలకు అదేశాలు జారీ చేశారు. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సుమారు 15 వేల ఎకరాలు సేకరించాలన్న లక్ష్యంతో ‘కుడా’ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మం తు ‘కుడా’ అధికారులతో సమావేశం నిర్వహించి భూ సేకరణ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎనుమాముల వైపు భూ సేకరణకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దశల వారీ గా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని పేర్కొంటున్నారు.
మొదట 5వేల ఎకరాల సేకరణ
ల్యాండ్ బ్యాంక్ కోసం 15 వేల ఎకరాల భూమి సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. నగర నలు దిక్కులా సేకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భూ సేకరణ చేపట్టాలని భావిస్తున్నారు. మొదట 5 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. దీనికి తోడు భవిష్యత్‌లో అభివృద్ధి చెందే ప్రాంతాల్లోనూ ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎనుమాముల వైపు భూ సేకరణకు శ్రీకారం చుడుతున్నారు. అక్కడి భూ యాజమానులతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో భూ సేకరణ చేపట్టేలా వారు కృషి చేస్తున్నారు. ఇన్నర్, ఔటర్ రోడ్డు అనుకొని ఉండే ప్రాంతంలో ల్యాండ్ బ్యాంక్ ఉండేలా చూస్తున్నారు.
నగరం నలువైపులా…
నగర నలువైపులా ‘కుడా’ ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తోంది. ముందుగా ఎనుమాముల వైపు దృష్టిసారించిన ‘కుడా’ భవిష్యత్‌లో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, ములుగు రహదారుల వైపు భూ సేకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు భూముల కొనుగోలు, అమ్మకాల్లో అనుభవం ఉన్న వారు ల్యాండ్‌బ్యాంక్ బాధ్యతను చేపట్టారు.