గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య
గ్రీవెన్స్‌లో నగరవాసుల నుంచి వినతుల స్వీకరణ
పెండిండ్ ఫైళ్లపై దృష్టి సారించాలి
గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
వరంగల్, సెప్టెంబర్ 6: ప్రజా సమస్యల పరిష్కారానికే బల్దియాలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. బల్దియా కౌన్సిల్ హాల్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో కమిషనర్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు, భవన నిర్మాణ అనుమతుల మంజూరులో జాప్యం, నల్లా లేకున్నా వస్తున్న పన్ను సమస్యలు గ్రీవెన్స్‌లో అధికారులకు వివరించారు. కాలనీల్లో సౌకర్యాలు కల్పించాలని బాధితులు అధికారులకు విన్నవించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారని, దీంతో 15 ఏళ్లుగా కాంప్లెక్స్‌లో వ్యాపారాలు చేస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వెనుక ఉన్న స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణం చేసి తమకు కేటాయించాలని మున్సిపల్ కాంప్లెక్స్ కిరాయిదారుల సంఘం కమిషనర్‌ను కోరింది. హసన్‌పర్తి కోమటిపల్లిలోని సర్వే నంబర్ 566ఏ/2లో తన సొంత భూమిలో కొంతమంది అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని నమిండ్ల బాబు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు అందించాడు.
రోడ్ల వెంట ఔషధ మొక్కలు పెంచాలి
నగర రోడ్లకు ఇరువైపులా ప్రజలకు ఉపయోగపడే ఔషధ మొక్కలు పెంచాలని సీపీఎం నాయకుడు సింగారపు బాబు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటి నంబర్ 7-1-197 ఇంటి సమీపంలో బర్రెలను కట్టివేయడం వల్ల వాటి విసర్జనంతో దుర్యాసనతో పాటు దోమలు వృద్ధి చెంది జ్వరాల బారిన పడుతున్నామని పద్మాక్షి కాలనీకి చెందిన సీహెచ్ రాజేశ్వర్ ఫిర్యాదు చేశాడు. 37వ డివిజన్ ఖిలావరంగల్ పరమరకోటలోని దళితబస్తీలో పబ్లిక్ టాయిలెట్ల స్థలం ఆక్రమణకు గురవుతున్నది, పరిరక్షించాలని స్థానికులు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. హన్మకొండలోని అశోకా థియేటర్ ఎదురుగా ఉన్న మున్సిపల్ స్థలంలో నాలుగు నెలల పాటు స్వెట్టర్ల విక్రయాల కోసం అనుమతులు ఇవ్వాలని టిబెటియన్ రిఫ్యూజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ కాలనీకి చెందిన విజయ తాను ఒంటరి మహిళను అని, ఆస్తి పన్నులో తగ్గింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుబేదారి అలీపురాలో డ్రైనేజీలను అసంపూర్తిగా శుభ్రం చేస్తున్నారని, దీంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తున్నదని ఎంఏ అలీ తెలిపారు. గ్రీవెన్స్‌లో మొత్తం 39 వినతులు వచ్చాయి. అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 21, ఇంజినీరింగ్ విభాగానికి 7, ప్రజారోగ్య విభాగానికి 4, పన్నుల విభాగానికి 6, హార్టికల్చర్ విభాగానికి ఒక వినతి వచ్చింది.
మానవతా థృక్పదంతో పరిష్కరించాలి
గ్రీవెన్స్‌లో వచ్చిన వినతులను మానవతా థృక్పదంతో పరిష్కారించాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో ఉన్న పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ ఆఫీస్, సిటీజన్ బడ్డీ ఫైళ్లను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. అనంతరం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్షించారు. చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్‌లో అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, డీఎఫ్‌వో కిశోర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, చీఫ్ హార్టికల్చర్ అధికారి సునీత, సిటీ ప్లానర్ వెంకన్న, కార్యదర్శి విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు రవీందర్ యాదవ్, జోనా హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, ఈఈ, డీఈ, ఏసీపీ, ఏఈలు పాల్గొన్నారు.
‘బండ్’ పనుల్లో వేగం పెంచాలి
స్మార్ట్‌సిటీ నిధులతో చేపట్టిన వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం ఆమె వడ్డేపల్లి బండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బండ్ సుందరీకరణలో భాగంగా మరిన్ని పనులకు ప్రతిపాదనలు చేయాలని ఆధికారులకు సూచించారు. బల్దియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ లెగసీ, రాశీవనాన్ని పరిశీలించారు. ఆమె వెంట కార్పొరేటర్ ఎలకంటి రాములు, దర్గా పీఠాధిపతి ఖస్రూపాషా, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, చీఫ్ హార్టికల్చర్ అధికారి సునీత, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, ఈఈ శ్రీనివాసరావు, డీఈలు రవికిరణ్, నరేందర్, ఏఈ హరికుమార్ ఉన్నారు.