హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 24: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్‌లోని జక్కలొద్దిలో నిర్వహించనున్న విజయగర్జన సభ రికార్డు బద్ధలుకొట్టబోతున్నదని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన హనుమకొండలోని అశోకా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 20ఏళ్ల క్రితం ఒకే ఒక్కడుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కఠోర దీక్షతో ఆనాటి ఉద్యమనేత, సీఎం కేసీఆర్ సాధించారన్నారు. 14 ఏళ్లపాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలను అధ్యయనం చేసి, తిరిగి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్లు విజయవంతంగా పనిచేసి వరంగల్‌లో కనీవినీఎరుగని రీతిలో విజయగర్జన పేరిట గతంలో ఏ పార్టీలు నిర్వహించని విధంగా సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ ప్రజలపై సీఎం కేసీఆర్‌కు అపారమైన నమ్మకం ఉందని, సభలు, కార్యక్రమాలకు వరంగల్ సెంటిమెంట్‌గా మారిందన్నారు. జక్కలొద్దిలో సుమారు 600 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇక్కడ సభ జరిపేందుకు రైతులు కూడా స్వచ్ఛందంగా ఒప్పుకున్నారని చెప్పారు. కొన్ని పార్టీలు ఆ ప్రాంత ప్రజల కోసం ఉద్యమించినప్పటికీ వారి ఆకాంక్ష నెరవేరిన తర్వాత మాత్రం ప్రభుత్వంలోకి రాలేకపోయారని, సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంతోపాటు రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కావడం చాలా గర్వంగా ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల దిశగా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని, కోటి ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదా ఆ రాష్ట్రంలోనైనా విలీనం చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరడం తెలిసిన విషయమేనన్నారు. టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దబోతున్నారని, వందేళ్ల వరకు పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు.
నవంబర్ 15న జరుగనున్న విజయగర్జనకు రాష్ట్రం నలువైపులా నుంచి పెద్దఎత్తున 10 లక్షలకు పైగా ప్రజలు 20వేల బస్సుల్లో తరలిరానున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుండగా, వరంగల్‌లో మాత్రం 29న 11 గంటలకు అభిరామ్గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యమకేసులు ఉన్నందున 27న నాంపల్లి కోర్టు హాజరుకావాలని, రాష్ట్ర వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమతితో 29న విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులోభాగంగా కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జిలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రతి డివిజన్ నుంచి 3 వేల మందికి తక్కువ కాకుండా సభకు కదిలి రానున్నట్లు తెలిపారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం 76 వేల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయిందని, త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, చీకటి ఆనంద్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.