హనుమకొండ, అక్టోబర్ 1: బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి శుక్రవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒకరూ కరోనా నిబంధనలు పాటించాలని, విధిగా మాసులు ధరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. అధికారులు మైదానాలను అందంగా తీర్చిదిద్దడంతోపాటు బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా సరిళ్లు ఏర్పాటు చేయూలని ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువులు, కుంటలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. దీంతోపాటు ప్రధాన కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించాలని, విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బతుకమ్మ నిర్వహించే మైదానాల్లో లైటింగ్, జనరేటర్లను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రాస్తాలను అందంగా అలంకరించి పండుగ వాతావరణం తలపించేలా చూడాలన్నారు. ఉత్సవాల్లో కళాజాత బృందాల ద్వారా సంసృతీ సంప్రదాయాలు ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మహిళలకు ఇబ్బందులు కలుగొద్దు
చెరువుల వద్ద మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు సూచించారు. విద్యుత్, నీటి సౌకర్యం, అగ్నిమాపక యంత్రాలు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వరంగల్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ శానిటేషన్‌ను సమర్థవంతగా చేపట్టాలని, ఎల్ఈడీ స్రీన్లను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిన్నారులు, మహిళల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. హనుమకొండ అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీసీపీ పుష్ప, డీఆర్వో ఎం వాసుచంద్ర, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.