వరంగల్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దామెర.. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే. బతుకుదెరువును బాగా ఇష్టంగా చేస్తారు. అందులోనే ఎక్కువ ఆదాయం వచ్చేలా, సాగు భరోసా ఉండేలా ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు గట్ల దామెర అంటేనే అందరికీ తెలిసేది. కొన్నేండ్లు ఎక్కువ మంది ఉల్లిగడ్డను సాగుచేస్తుండడంతో ఈ ఊరు పేరు ఉల్లిగడ్డ దామెర అయ్యింది. చుట్టుపక్కల ఊర్లలో ఏ రైతు కొత్తగా ఉల్లి వేయాలన్నా దామెరకు వచ్చి చూడాల్సిందే. దశాబ్దం క్రితం దాకా అందరిలాగే ఇక్కడి రైతులు సంప్రదాయ పంటలు పండించేవారు. వరి, మక్కజొన్న, పత్తి తప్ప ఇతర పంటలు ఉండేవి కావు. పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం, మార్కెట్లో ఆశించిన ధర రాకపోవడంతో కొత్తదారిలో ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో రెండు, మూడేండ్లుగా ఈ ఊరిలో కొత్త పంటల సాగు బాగా పెరిగింది. సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ప్రస్తుతం 500 ఎకరాల వరకు ఉల్లిగడ్డ, 250 ఎకరాల వరకు పసుపు పంటను సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనేది లేదని చెబుతుండడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దామెరలో 20మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ముందుకొచ్చారు. ఒక్కో రైతు 4 నుంచి 8 ఎకరాల్లో పామాయిల్ సాగుచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉద్యాన శాఖకు అంగీకారం తెలిపారు. దామెర రైతులను ఆదర్శంగా తీసుకుని ఎల్కతుర్తిలో 25, గోపాల్‌పూర్‌లో 16, దండేపల్లిలో 11, కేశవాపూర్‌లో 2, తిమ్మాపూర్‌లో 5, జీల్గులలో 1, బావుపేటలో 20 మంది రైతులు పంట సాగుచేసేందుకు ఉత్సాహం చూపారు.
పామాయిల్‌పై అవగాహన..
పామాయిల్ సాగుచేసేందుకు ముందుకొచ్చిన రైతులకు ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని ముదిగొండ, అశ్వరావుపేటకు తీసుకెళ్లి అక్కడి రైతుల అనుభవాలు, సాగు విధానం, పెట్టుబడి, లాభాలు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు. దీంతో ఒక అంచనాకు వచ్చిన దామెర రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ వేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో రూ.28కు ఒక మొక్క ఇస్తోంది. ఎకరానికి 63 మొక్కలు నాటుతారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఒక్కో మొక్క రూ.250 ఉంటుంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నర్సరీ నుంచి తీసుకొచ్చి గుంతలు తీసి నాటిస్తారు. మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించనున్నారు. డ్రిప్ పరికరాలను కూడా సబ్సిడీపై ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. మొక్కలు నాటిన నాలుగో ఏడాదిలో పంట చేతికొస్తుంది. మొదటి మూడేండ్లు పంట నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రైతులకు డబ్బులు ఇస్తుంది. వరి, పత్తి తదితర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగులో అధిక లాభాలు ఉండడం, ప్రభుత్వ సబ్సిడీలు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు పామాయిల్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు.
కొత్త పంటతోనే మేలు
ఏటా ఒక్కటే పంట వేయకుండా పంటల మార్పిడి చేస్తే భూమికి మంచిది. మాకు ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. ఎకరంన్నరలో ఉల్లిగడ్డ, వరి, పత్తి పంటలు పెట్టిన. రోగాలు, అధిక వానలతో వరి, పత్తి పంట అనుకున్నట్లు రావడం లేదు. ఈ మధ్యనే అధికారులు వచ్చి పామాయిల్ గురించి తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు పోయి అక్కడ పామాయిల్ తోటలు చూసినం. మంచిగా అనిపించింది. కూలీలు ఎక్కువగా అవసరం లేదు. ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది కాబట్టి పెట్టుబడి తక్కువగా అయితది. ఆరు ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలనుకుంటున్న.
పత్తి, వరిలో ఏం మిగుల్తలేదు
ఎన్నటి నుండో పత్తి, వరి పంటలే పండిస్తానం. ఏం మిగుల్తలేదు. కూలోల్లు దొరుకతలేరు. వానలు ఎక్కువైతే మొత్తమే నష్టం జరుగుతాంది. పెట్టుబడులు ఎక్కువ.. లాభాలు తక్కువ అయినయి. పామాయిల్ పంట గురించి విన్న. ఈ పంట రైతుల దగ్గరకు పోయి చూసొచ్చినం. సబ్సిడీలు ఎక్కువగానే ఉన్నాయి. నాలుగెకరాల్లో పామాయిల్ పండిస్త. వచ్చే వానకాలం సీజన్లో పామాయిల్ మొక్కలు ఇత్తమని అధికారులు చెప్పిన్రు.
వడ్లు కొంటలేరని..
వరికి బదులు వేరే పంటలు వేయాలని అధికారులు చెప్తున్నరు. పత్తిలో నష్టాలే వస్తున్నయ్. అధికారులు వచ్చి పామాయిల్ తోటల గురించి చెప్పిన్రు. మంచిగనిపించింది. ఖమ్మం పోయి చూసి వచ్చినం. ఇప్పుడు ఎవుసానికి కూలీలు దొరుకుతలేరు. పామాయిల్ పెడుదామని అనుకున్న. ఇప్పుడు రెండెకరాల్లో మిరప, ఆరెకరాల్లో వరి పండిస్తాన. ఇగ మొత్తం భూమిల పామాయిలే పెడ్త.