మట్టెవాడ, డిసెంబర్ 7 : పరిచయమే ప్రాణం మీదికి తెచ్చింది. రూ.ఐదు లక్షలు ఇవ్వనందుకు దారుణంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం.. ములుగు జిల్లా కోమటిపల్లి గ్రామానికి చెందిన జకుల శ్రీనివాసరావు గతంలో ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం హనుమకొండ పట్టణంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉండే వ్యక్తులను టార్గెట్ చేసి, వాళ్లను మచ్చిక చేసుకొని చిన్నచిన్న నేరాలకు పాల్పడుతుండేవాడు.
ఇలా రెండు నెలల క్రితం హనుమకొండ, శ్రీనగర్ కాలనీ చెందిన ఎలిగేటి రాజమోహన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఒక వ్యక్తి ద్వారా శ్రీనివాసరావుకు పరిచయమయ్యాడు. రెండు నెలలుగా ఇద్దరూ స్నేహంగా ఉంటున్నారు. రాజమోహన్‌ను మరింత దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాసరావు అప్పుడప్పుడు మద్యం తాగించేవాడు. దీంతో వారిద్దరూ మంచి స్నేహితులయిన తర్వాత రాజమోహన్‌ను రూ.5లక్షల అప్పు కావాలని నిత్యం అడుగుతున్నా దాటేసేవాడు.
దీంతో శ్రీనివాసరావు కన్ను రాజమోహన్ ధరించిన బంగారు వస్తువులపై పడింది. పకా ప్రణాళికతో అతడిని హత్య చేయాలనుకున్నాడు. ఈ నెల 2న రాత్రి శ్రీనివాసరావు కిరాయి ఉంటున్న పోస్టల్‌కాలనీలోని ఇంటికి వస్తే, ఇద్దరం కలిసి తాగుదామనడంతో రాజమోహన్‌ను తన కారులో శ్రీనివాస్ ఇంటి వచ్చాడు. అకడ ఇద్దరూ కలిసి అర్ధరాత్రి మద్యం తాగారు. పకా ప్రణాళిక వేసుకున్న శ్రీనివాసరావు రాజమోహన్‌కు ఎక్కువగా మద్యం తాగించి సృ్పహ కోల్పోయిన తర్వాత తన ఇంట్లో ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టారు. దీంతో రాజమోహన్ అకడికకడే మృతి చెందాడు. హత్య జరిగిన తర్వాత తీవ్ర ఆందోళనకు గురైన శ్రీనివాసరావు అర్ధరాత్రి రాజమోహన్ మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి కారులోనే వెనక సీట్లో పడేశాడు.
అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను తొలగిస్తుండగా, ఇంటి యజమాని రక్తపు మరకలు ఎవరివని అడుగగా, పెంపుడు కుకవని సమాధానం చెప్పాడు. కారులో ఉన్న రాజమోహన్ మృతదేహంతో హనుమకొండలోని కేయూ జంక్షన్, రెడ్డిపురం చెరువు, డబ్బాలఅడ్డ, వడ్డేపల్లి రోడ్డు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిరిగాడు. చివరకు రంగంపేట ప్రాంతంలో రాజమోహన్ మృతదేహాన్ని, కారును అకడ వదిలి పరారయ్యారు.
రాజమోహన్ హత్య నగరంలో తీవ్ర సంచలనంగా మారడంతో మట్టెవాడ పోలీసులు సీరియస్ తీసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా జకుల శ్రీనివాసరావు రాజమోహన్ హత్య చేసి పరారైనట్లు తమ విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన మట్టెవాడ సీఐ గోపి, ఎస్సైలు విఠల్, నవీన్, సాంబయ్య, లచ్చయ్య, సిబ్బందిని ఏసీపీ నందిరాంనాయక్ అభినందించారు.