Hanumakonda | భీమదేవరపల్లి, జూలై 20: నాలుగు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమౌతుందని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పార్నందుల మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 19 ఏళ్లుగా పని చేస్తున్నామని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇటువంటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడూ దాపరించలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎఫ్ టిఈ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించి వెంటనే వేతనాలు పెంచుతామని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి, సత్వరమే వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.