వరంగల్‌చౌరస్తా, నవంబర్ 18: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పార్టీ వరంగల్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. 27వ డివిజన్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓట్ల కోసం వచ్చే పారాచూట్ నాయకులను నమ్మి మోసపోవద్దని, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారాలపై పూర్తిస్థాయిలో తనకు పట్టు ఉందని, కారు గుర్తుకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. గోవిందరాజులస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ప్రచారం లక్ష్మీపురంలోని బొడ్రాయి, ముదిరాజ్‌కాలనీ, హెడ్‌పోస్టాఫీస్, రైల్వేస్టేషన్, రాంఖీ విల్లాస్, యాకూబ్ పుర, అబ్బనికుంట వరకు సాగింది. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేగా ఎదిగి ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నానని చెప్పారు. తనకు తూర్పు నియోజకవర్గ సమస్యలపై పూర్తిస్థాయి పట్టు ఉందని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పట్టులేదన్నారు. కాంగ్రెస్ నాయకులు పచ్చగా ఉన్న తూర్పులో చిచ్చులు పెట్టి, మన బిడ్డలను బానిసలుగా మార్చుకునే ప్రమాదం ఉందని, వారి మాయమాటలను ఎవరూ నమ్మొద్దని కోరారు. వరంగల్ నగరంలో ఉన్న ఒక్కగానొక్క ఆజంజాహి మిల్లును కాంగ్రెస్ అమ్మితే… బీఆర్ఎస్ ప్రభుత్వం 1200 ఎకరాల్లో మెగా టెక్స్‌టైట్ పార్కును ఏర్పాటు చేసిందన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీహెచ్ అనిల్‌కుమార్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పోలెపాక యాకూబ్, 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్, రాజేశ్, ఆదినారాయణ, రాజ్‌కుమార్, శ్యామ్, సత్యం, సుధాకర్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని, అందుకే మరోసారి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నానని నన్నపునేని నరేందర్ అన్నారు. 12వ డివిజన్ దేశాయిపేటలోని యాదవ, గౌడ, రజక, రెడ్డి పలు కుల సంఘాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపి ఏకగ్రీవం చేసిన తీర్మాన ప్రతులను ఎమ్మెల్యే నరేందర్‌కు అందజేశారు. అలాగే, ఎమ్మెల్యే సమక్షంలో తాము కారు గుర్తుకే ఓటు వేస్తామని, ఇతర పార్టీలను నమ్మబోమని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. దేశాయిపేటలోని ప్రతి వీధిలో రోడ్లన్నింటినీ అద్దంలా మార్చానని, ప్రతి కమ్యూనిటీకి ఆత్మగౌరవ భవనం నిర్మించానని తెలిపారు. అలాగే, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తూర్పులో తాను ఊహించని అభివృద్ధి చేసినట్లు వివరించారు. నాడు దేశాయిపేటను గ్రామీణ ప్రాంతంగా గత పాలకులు చూశారని, నేడు నియోజకవర్గంలోనే రోల్ మోడల్‌గా మారిందని వివరించారు. దేశాయిపేటలో పోచమ్మ గుడి పక్కన ఉన్న స్థలంలో ప్రజల కోరిక మేరకు ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకుడు రాకేశ్‌రెడ్డి, కార్పొరేటర్ కావటి కవిత, దిడ్డి కుమారస్వామి, బస్వరాజు కుమారస్వామి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: తనపై నమ్మకంతో బీఆర్ఎస్లో చేరుతున్న ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి 25వ డివిజన్ మండిబజార్‌లో బీఆర్ఎస్ నాయకులు భూపాల్, జాకీర్ ఆధ్వర్యంలో డివిజన్‌కు చెందిన ఫైజల్, ఫిరోజ్, ఆకాశ్, జావేద్, నాగరాజు, సోహైల్, ఇమ్రాన్, గౌస్‌తోపాటు వందమంది యువకులను శివనగర్‌లో బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. నన్నపునేని గెలుపులో భాగస్వాములం అవుతామని ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు స్పష్టం చేశారు.
గిర్మాజీపేట: అభివృద్ధి నిరోధకుల మాటలు నమ్మితే అధోగతేనని నన్నపునేని అన్నారు. శనివారం రాత్రి ఆయన 33వ డివిజన్లోని ఎస్‌ఆర్‌ఆర్‌తోట, సీఆర్‌నగర్, 60 ఫీట్లరోడ్, శాంతినగర్, పెరుకవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు ఏమీచేయని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు అనర్హులని, ఈ విషయం నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.