ములుగు, జనవరి 21(నమస్తే తెలంగాణ) : ‘నా అడవి.. నా ఇష్టం’ అన్న చందాన అటవీశాఖ వ్యవహరిస్తున్నది. ఇతరులు పూచిక పుల్ల ముట్టుకున్నా, రోడ్డు వేద్దామన్నా, ఇసుక తీద్దామన్నా చట్టాలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేసే అధికారులు.. రోడ్డు మరమ్మతు కోసం దర్జాగా యంత్రాలతో చెట్లను కూల్చివేసి వందల కొద్దీ టిప్పర్ల మొ రాన్ని తరలిస్తున్నారు. ములుగు జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో వేసే రోడ్లను ఏళ్లుగా అడ్డుకున్న అటవీశాఖ.. ప్రస్తుత మేడారం జాతరకు మాత్రం కాంట్రాక్టర్ అవతారమెత్తింది. నిబంధనలను తుంగలో తొక్కి మట్టి, మొరం తరలింపు పేరుతో దట్టమైన అడవిని ధ్వంసం చేస్తున్నది.
మేడారం జాతర సందర్భంగా అటవీ అధికారులు ఊరట్టం నుంచి కొం డాయి మార్గంలోని గుంతలను మొరంతో పూడ్చేస్తున్నారు. ఐలాపూర్ వరకు గల ఈ రోడ్డుకు 2016లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 19 కోట్లు కేటాయించింది. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించగా గుత్తేదారు పనులు చేపట్టకుండా అధికారులు అభయారణ్యం, రిజర్వు ఫారెస్టు అంటూ అడ్డుకున్నారు. 2020 జాతర సమయంలోనూ అలాగే చేశారు. ఊరట్టం నుంచి కొండాయి వరకు 12 కిలోమీటర్ల దూరంలో 14 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉండగా 2022 జాతర నాటికి కాంట్రాక్టర్ ఐదింటిని పూర్తిచేసి అక్కడక్కడా లెవలింగ్ చేశారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు జరిమానా విధించారు. ఈ పని చేయించిన ఇంజినీరింగ్ అధికారిపై కేసు నమోదు చేశారు. దీంతో అటు అధికారులు, సదరు కాంట్రాక్టర్ చేసేదేమీ లేక పనులు నిలిపివేశారు.
నిబంధనలు తుంగలో తొక్కి..
ప్రస్తుత జాతర సందర్భంగా ఊరట్టం నుంచి కొండాయి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కలెక్టర్ రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో పాటు అటవీశాఖ అడ్డుకుంటుందని ఆర్అండ్బీ అధికారులు పని చేసేందుకు నిరాకరించారు. దీంతో రెండు శాఖల మధ్య కొనసాగిన చర్చల్లో రోడ్డు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చిన అటవీశాఖ అధికారులు పటిష్టమైన చట్టాలను తుంగలో తొక్కారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఊరట్టం-కొండాయి రోడ్డుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని అడవిలో మొరాన్ని గుర్తించి భారీ యంత్రాల సాయంతో టిప్పర్లతో తరలిస్తూ గుంతలు పూడ్చుతున్నారు. చట్టాలను ఉల్లంఘించి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను సైతం కూల్చివేశారు.
మరమ్మతు కోసం మొదట రూ. 35 లక్షలు కేటాయించగా, అటవీశాఖ అధికారులు ఓ కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయిస్తున్నట్లు సమాచారం. అనేక చోట్ల అటవీ అధికారులు అడ్డుకోవడంతో పలు గ్రామాల్లో ఇప్పటి వరకు రోడ్లు లేకుండా పోయాయి. మేడారం జాతర భక్తులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు మరమ్మతు చేపట్టిన అటవీశాఖ తమ గ్రామాల రోడ్ల పనులను అడ్డుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జాతరకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, చర్ల, భద్రాచలం భక్తులకు చెందిన ప్రైవేటు వాహనాలు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయి, ఊరట్టం మీదుగా మేడారానికి మట్టి రోడ్డు ద్వారానే చేరుకుంటాయి. ఈ రోడ్డును బీటీగా మార్చాలని కొండాయిలోని గోవిందరాజుల పూజారులు అనేక సార్లు విన్నవించుకున్నా ససేమిరా అన్నారు. ఈ మార్గంలోనే గోవిందరాజును మేడారం తీసుకెళ్తారు. ఈ క్రమంలో వచ్చి పోయే వాహనాలతో లేచే దుమ్ముతో పూజారులు, గ్రామస్తులు నరక యాతన అనుభవిస్తుంటారు. ఇన్ని బాధలను పెడ చెవిన పెట్టిన అటవీశాఖ మాత్రం ఇప్పుడు దర్జాగా చేస్తున్న రోడ్డు మరమ్మతు పనులపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.