హనుమకొండ, నవంబర్ 21: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ గోల్డ్‌కప్ 2025 -టి20 టోర్నమెంట్ కోసం ఈనెల 23న వరంగల్ జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మన తెలంగాణలో ఉన్న నిజమైన ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అర్హులైన క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ గోల్డ్ కప్‌ను రాష్ర్టవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు, ప్రతిభ ఉన్న ప్రతి యువకుడు సెలక్షన్లలో పాల్గొనాలన్నారు.
ఎంపికలు పూర్తిగా మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు, వరంగల్ జిల్లా తరఫున హనుమకొండ-1, వరంగల్-1 టీంలను ఈ సెలక్షన్స్ ఆధారంగా సిద్ధం చేస్తున్నట్లు టోర్నమెంట్ ఫైనల్స్ హైదరాబాదులో నిర్వహించబడతాయని తెలిపారు.
హెచ్‌సీఏ ఎంపికల్లో అనేక అక్రమాలు
గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలన్నీ అవినీతి, పక్షపాత, అక్రమాలు జరిగాయని దీని కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులు అవకాశాలు కోల్పోయారన్నారు. ఈ అన్యాయ వ్యవస్థకు ముగింపు పలకడానికి నిజమైన ట్యాలెంట్‌కు న్యాయం చేయడానికి టీసీఏ పూర్తిగా పారదర్శక సెలక్షన్ విధానాన్ని అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
టీసీఏ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈస్ట్‌జోన్ కోఆర్డినేటర్ తాళ్లపెళ్లి జైపాల్ మాట్లాడుతూ 23న ఆదివారం ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లావారు ఓసిటీ గ్రౌండ్లో, హనుమకొండ జిల్లావారు JNS జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) గ్రౌండ్స్‌లో ఉంటుందని, వరంగల్, హనుమకొండ నుంచి ఎంపికైన టీమ్స్ 24న ఖమ్మంలో ఈస్ట్‌జోన్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో ఎంపికైన ప్లేయర్లందరికి డ్రెస్ కిట్, క్రికెట్ కిట్ టీసీఏ తరఫున ఉచితంగా ఇవ్వబడుతుం దన్నారు. అదనపు వివరాల కోసం ఈస్ట్ జోన్ కోఆర్డినేటర్లు తాళ్లపెళ్లి జైపాల్ 95811 24444 సమీ 90325 24193 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.