స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 9 : పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ రైతులు ధర్నా చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ బీఎంసీ(బిల్క మిల్క్ కూలింగ్) యూనిట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాల రైతులు శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్ జాతీయ రహదారిపై పాల డబ్బాలతో రాస్తారోకో చేయగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు చేరుకొని వారిని సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.
ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ స్టేషన్ ఘన్పూర్ బీఎంసీ యూనిట్‌కు పదిహేను రోజుల పాల బిల్లు సుమారు రూ.50 లక్షలు అవుతుందని, గతేడాది నవంబర్ నుంచి రెండు, మూడు నెలలకు ఒకసారి, అది కూడా 15రోజుల బిల్లులు మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. డెయిరీ బిల్లులు ఇవ్వకపోవడంతో బ్యాంకు కిస్తీలు కట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఐదు బిల్లులు రావాల్సి ఉందని, ఒక్కొక్కరికి సుమారు రూ.లక్ష వరకు పెండింగ్ ఉందన్నారు.
విజయ డెయిరీకి ముఖ్యమంత్రే చైర్మన్‌గా ఉన్నా పాడి పరిశ్రమకు ఇటీవలి బడ్జెట్లో నిధులేమీ కేటాయించలేదన్నారు. మరొకరిని చైర్మన్‌గా నియమించకుండా రేవంత్ సర్కారు రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించి, ప్రతి 15రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిరసన తెలిపిన వారిలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సొసైటీ అధ్యక్షుడు సాదం రమేశ్, గొర్రెల కుమారస్వామి, ఈర్ల రాజయ్య, గుర్రపు కుమారస్వామి, మునిగల వెంకన్న, పదిర లక్ష్మారెడ్డి, పదిర వాసుదేవ రెడ్డి, వడ్లూరి వెంకటాద్రి, కోల కుమార్ పాల్గొన్నారు.