హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 23: ఆపత్కాలంలో దేశానికి సారథ్యం వహించిన మహానేత పీవీ నరసింహరావు అని కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా విశ్వవిద్యాలయ హ్యుమానిటీస్ భవనంలోని పొలిటికల్ సైన్స్ విభాగ సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పీవీ నరసింహరావు దిశానిర్దేశం చేశారన్నారు.
అపర చాణక్యుడిగా ఎన్నో దీర్ఘకాలిక ప్రణాళికలను అమలుచేసి నేటి దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శిగా నిలిచారని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకుముందు పీవీ నరసింహరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి సంకేనేని వెంకట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఆకుతోట శ్రీనివాసులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.