హనుమకొండ చౌరస్తా, మే 21: తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కి కాళేశ్వరం కమిషన్ నోటీసులను పంపడాన్ని కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులుగానే పరిగణిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్ది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌కి నోటీసులు పండడం పూర్తిగా రాజకీయ కక్షపూరిత చర్యనే అని దుయ్యబట్టారు.
నిద్రాహారాలు లెక్కచేయకుండా తెలంగాణ ప్రజల సాగు నీటి గోస తీర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని, తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారిందని పచ్చని పంటలతో విరాజిల్లిందని తెలిపారు. భూకంపం వచ్చినా చెక్కుచెదరని కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటసు ఇవ్వడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలు ఆమలు చేయలేక పాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు అవసరమున్నప్పుడల్లా ఇలాంటి డైవర్షన్ పాలి‘టీక్స్’ ఉపయోగిస్తున్నాడని మండిపడ్డాడు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తెలంగాణ సమాజం నమ్మదన్నారు. ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ శ్రేయస్సు కోసమే పనిచేసే కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలు చేయడం, తెలంగాణ సమాజం సహించదని, సూర్యుడి మీద ఉమ్మివేయాలని చూస్తే అది మీ మీదే పడుతుందని చల్లా వెంకటేశ్వర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.