భారీ వర్షాలు కూరగాయలపైనా ప్రభావం చూపుతున్నాయి. వరి, పత్తి, మక్కజొన్న, మిర్చితో పాటు కూరగాయల పంటలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లడంతో ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల వరద బీభత్సానికి మహబూబాబాద్ జిల్లాలో బెండ, దొండ, టమాట, వంకాయ, బీరకాయ, దోసకాయ తోటలు కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల నీట మునిగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాకు పొరుగున ఉన్న సూర్యాపేట, కోదాడ సహా ఏపీలోని విజయవాడ, గుంటూరు నుంచి కూరగాయలు వస్తుంటాయి. అయితే అక్కడా వరదలు ముంచెత్తడంతో కూరగాయ ల ధరలకు రెక్కలొచ్చి మార్కెట్కు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వరదలకు ముందు రూ.20 ఉన్న బెండకాయ ఇప్పుడు రూ.60కి, రూ.50 ఉన్న బీరకాయ రూ. 80 కి ఎగబాక డంతో గిట్లయితే ‘ఏం కొనలేం.. ఏం తినలేం’ అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించడంతో పాటు రోడ్లు తెగిపోయి, ఇండ్లు కూలిపోయి, పంటలు కొట్టుకుపోయి, చెరువులకు గండ్లు పడ్డాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ధరలకు ఒకసారిగా రెకలు వచ్చాయి. వరదలకు ముందు, తర్వాత కూరగాయల ధరలు పరిశీలిస్తే ఆకాశాన్నంటాయి. జిల్లాకు కూరగాయలు విజయవాడ, కోదాడ, సూర్యాపేట ప్రాంతాల నుంచి వస్తాయి. ఇటీవల ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాతో పాటు పక రాష్ట్రమైన ఏపీలోని విజయవాడ, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావం ఎకువగా ఉంది. అకడ కూడా కూరగాయల పంటలు దెబ్బతినడంతో జిల్లాకు రవాణా నిలిచిపోయింది. జిల్లాకు చుట్టుపక్క ప్రాంతమైన సూర్యాపేట, కోదాడలో కూడా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగిలిన కొద్దిపాటి కూరగాయలకు మారెట్కు డిమాండ్ ఏర్పడింది. జిల్లాలో 1000 ఎకరాల్లో సాగవుతున్న కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా, మెంతికూర.. ఇలా ఏది ముట్టుకున్నా రూ.50 పై మాటే.. వరదలకు ముందు రూ.20లకు కిలో ఉన్న బెండకాయ వేగంగా రూ.60కు చేరింది. కాకరకాయ రూ.50 నుంచి 80కి చేరింది. రూ.10కి కిలో ఉన్న టమాటల ధర రూ.60కి పెరిగింది. రూ.50లకు కిలో ఉన్న బీరకాయ ప్రస్తుతం రూ.80కి ఎగబాకింది. అకాల వర్షాలు, వరద బీభత్సంతో జిల్లాలో చాలా నష్టపోయిన రైతులు ఇప్పుడు తిందామంటే కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు పెరిగిన ధరలతో జనం సతమతమవుతుంటే దళారులు చేరి ధరలు మరింత పెంచి విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులు కిలో కొనాల్సినవారు అర కిలో, అర కిలో కూరగాయలు కొనాలనుకున్న వారు పావు కిలో చొప్పున తీసుకునే పరిస్థితి ఏర్పడింది. వరదలతో అన్ని శాఖలు నష్టాల అంచనా కోసం తిరుగుతుండగా, నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదలపై పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పటికైనా అధికారులు కూరగాయలతో పాటు నిత్యావసరాల ధరలను అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మానుకోటలో వరదలకు ముందు కూరగాయ ధరలు ఒక ఎత్తు అయితే వరదల తర్వాత విపరీతంగా కూరగాయల ధరలు పెరిగాయి. అన్ని రకాల కూరగాయ ధరలు పెరగడంతో ఏమి కొనేటట్టు లేదు. ఇప్పటికైనా కూరగాయ ధరలు తగ్గించకుంటే సామాన్యుడు బతుకుడు కష్టమే.