మహబూబాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దున్నది. తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5కోట్ల మంజూరు చేయగా ఆ నిధులతో దేవాలయానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు పనులు పూర్తి చేశారు. కురవి ఆలయానికి నాడు కేసీఆర్ వచ్చినప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమీసాలు చేయిస్తానని మొక్కుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో శివరాత్రి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి బంగారు కోరమీసాలు తెచ్చి స్వామి వారికి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. అలాగే కేటాయించిన నిధులతో పనులు పూర్తవడంతో ఆలయం సరికొత్త రూపు సంతరించుకుంది. భక్తులు కూడా అతి తక్కువ సమయంలో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కురవి వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులు ఇలా..
కురవి వీరభద్రస్వామి ఆలయంలో మొత్తం రూ.5కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. కల్యాణకట్టకు రూ.19,60,372, మినీ రాజగోపురం దక్షిణం, పడమర వైపు నిర్మాణం కోసం రూ.9,86,734, టాయిలెట్లు, బాత్రూమ్స్ కోసం రూ.16,60,299, భద్రకాళి అమ్మవారి గుడి సాలహారం కోసం రూ.15,62,253, నవగ్రహ మండపం కోసం రూ.4,49,323, ఆంజనేయస్వామి గుడి కోసం రూ.4,64,430, బంజారా సత్రానికి రూ.1,65,81,114, కంపౌండ్ వాల్ నుంచి రథం ఏరియా కోసం రూ.18,48,972, నాగమయ్య టెంపుల్ కోసం రూ.14,07,172, ప్రాకార మండపం రూ.74,71,222, వీరభద్ర గుడి లోపల గ్రానైట్ స్టోన్ కోసం రూ.31,68,579, రాజగోపురానికి రూ.34,05,315, కాలక్షేప మండపం కోసం రూ.29,43,927 కలిపి మొత్తం రూ.4,39,09,712లతో పనులు పూర్తికాగా మిగతావి పురోగతిలో ఉన్నాయి.
సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది..
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆలయాలకు పూర్వవైభవం దక్కిందంటే అది సీఎం కేసీఆర్ చలవే. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇటీవలే యాదాద్రి ఆలయాన్ని పాలకమండలి సభ్యులతో సందర్శించా. అలాగే ఒకప్పటి వీరభద్రుడి ఆలయానికి, ఇప్పటికి అసలు పొంతనే లేదు. సీఎం కేసీఆర్ చొరవతో గుడి రూపురేఖలు మారాయి. రద్దీ కూడా పెరిగింది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి ఐకే రెడ్డి సహకారంతో వీఐపీ, సాధారణ భక్తుల కోసం గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు కృషిచేస్తాం.
– బాదావత్ రామునాయక్, ఆలయ చైర్మన్
త్వరలో అన్ని పనులు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5కోట్లతో 17 పనులను చేపట్టాం. కరోనా వల్ల పనులు ఆలస్యంగా పూర్తి అయ్యాయి. 14 పనులు పూర్తయ్యాయి. తూర్పు రాజగోపురం, ఆలయ లోపలి భాగంలో గ్రానైట్ రాయి వంటి బృహత్తర పనులను పూర్తిచేశాం. మిగితా పనులకు రీ ఎస్ట్‌మేషన్ ద్వారా త్వరలోనే ప్రారంభిస్తాం.
– సత్యనారాయణ, ఆలయ ఈవో
ఎంతో అభివృద్ధి చెందింది
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు అసలు ఆలయాల గురించి పట్టించుకున్నవారే లేరు. నేను ఎన్నోసార్లు వీరభద్రస్వామి గుడికి వచ్చాను. ప్రతి సంవత్సరం మార్పు గమనిస్తున్నా. ఇదివరకు ఆలయం రాళ్లు రప్పలతో నిండి ఎగుడుదిగుడుగా నడవడానికి ఇబ్బందిగా ఉండేది. లోపల పాలిష్‌రాయి పరిచి, లెవలింగ్ చేయడంతో మెరిసిపోతోంది. కనీసం స్నానాల గదులు లేకపోయేది. కేసీఆర్ సర్కారు నిధులు ఇవ్వడంతో సౌకర్యాలు పెరిగాయి. ఇలా ఈ ఒక్క ఆలయమే కాదు.. తెలంగాణలోని ఎన్నో ఆలయాలను తీర్చిదిద్దుదున్న సీఎం కేసీఆర్‌కు భక్తజనులంతా రుణపడి ఉంటారు.
– కొత్తపల్లి శివ, రేపల్లెవాడ, ఖమ్మం జిల్లా