కురవి, జూలై 08 : కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం మంగళవారం శాకాంబరి అలంకరణలో భక్తులను అలరించింది. తీరొక్క రకం కూరగాయలతో గర్భగుడిలోని స్వామివారు, అమ్మవారుల మూలవిరాట్టులను అందంగా అలంకరించారు. అనంతరం స్వయంభు భద్రకాళి అమ్మవారిని శాకంబరి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ..శాకాంబరీ అలంకరణ అనేది మాత భద్రకాళి దేవి ఒక విశేష రూపమన్నారు. శాకాంబరి అంటే శాకం అంటే కూరగాయలు, ఆకుకూరలు – అమ్మవారు భూమిపై జీవుల్ని పోషించేందుకు అన్నపూర్ణ అవతారంగా కనిపించిన రూపం. ఇది ప్రత్యేకంగా వర్షాకాలంలో చేసేది.
ప్రకృతితో మమేకమై భక్తులు అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించి పూజిస్తారన్నారు. పాడిపంటలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆషాడ మాసంలో ఈ శాఖంబరి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఆలయ పూజారులు, భక్తులు కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పళ్లు వంటి పదార్థాలతో అమ్మవారిని, వీరభద్ర స్వామివారి మూలవిరాట్లను శోభాయమానంగా అలంకరించారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించారు. శాకంబరి అవతారంలో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.