హనుమకొండ చౌరస్తా, జనవరి 2: రాష్ర్టంలో 1976 కాలంలో కేవలం 3 కాలేజీలు మాత్రమే ఉండేవని, వాటిలో వరంగల్‌లోని ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీ ఒకటని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శతాబ్దానికి చేరువైన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కళాశాల ఔన్నత్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ర్ట ఉన్నత విద్యామండలి రూపొందిస్తున్న నూతన పాఠ్యప్రణాళిక విధానంలో నైపుణ్యాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని, దీనికి అనుగుణంగా ఆర్ట్స్, సామాజిక శాస్త్రాలు, వాణిజ్యశాస్త్రం, విజ్ఞానశాస్త్ర విభాగాలలో నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన చేపట్టాలని సూచించారు.
ఒప్పంద, రోజువారి వేతన అధ్యాపకుల సమస్యలను తమ పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు. కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు, సదస్సు మందిరంలో అవసరమైన సౌకర్యాల కల్పనకు వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు. కాలేజీ జాతీయ మూల్యాంకన గుర్తింపు సంస్థ (న్యాక్) గుర్తింపుకు వెళ్లాల్సి ఉందని, ఇందుకనుగుణంగా అధ్యాపకులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.
రాష్ర్ట ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఫేస్ రికగ్నైజేషన్ హాజరువిధానం కాలేజీలోఓ కూడా అమలులోకి తీసుకొస్తున్నామని, ఇది పార్ట్ టైం, ఒప్పంద అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని, 15 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పార్ట్‌టైం అధ్యాపకులకు నెలనెలా జీతాలు చెల్లిస్తామన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం కనకయ్య, శ్రీధర్‌కుమార్, శేషు, ఫిరోజ్, జూల సత్యం, రమాదేవి పాల్గొన్నారు.