హనుమకొండ చౌరస్తా, జూన్ 12: విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. వరంగల్ స్పోర్ట్స్కౌన్సిల్ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ డిస్కమ్స్‌కు సంబంధించి 2025-2026 సంవత్సరానికి ఇంటర్ సర్కిల్ కబడ్డీ అండ్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను ఈనెల 12 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నారు. కబడ్డీ అండ్ బాల్‌బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎండీ వరుణ్‌రెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ముందుగా స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ ఆటల పోటీల వలన విద్యుత్‌శాఖల మధ్య మరింత స్నేహపూర్వక బంధం బలపడుతుందని, ఎవరు గెలిచినా ఓడిన అన్నదమ్ముళ్లు అనే భావన ఉండాలన్నారు. విద్యుత్‌శాఖలో పనిచేసే ఉద్యోగులంతా ఒక ఫ్యామిలీగా ఉంటారన్నారు. ఈ పోటీలలో కబడ్డీ 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్ 9 జట్లు పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇంచార్జి డైరెక్టర్లు బి.అశోక్‌కుమార్, టి.సదర్లాల్, వి.తిరుపతిరెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్‌రావు, డీఈ టెక్నికల్ ఏ.విజయేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, ట్రెజరర్ ఎం.సంతోష్, కౌన్సిల్ మెంబెర్స్ ఎండి.యాకుబ్‌పాషా, వి.సునీల్‌కుమార్, ఇ.ప్రేమ్‌కుమార్ అన్ని సర్కిళ్ల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.