పోచమ్మమైదాన్, మార్చి 28 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 13వ డివిజన్ ఎల్బీ నగర్లో రూ.2.96కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రతి డివిజన్లో ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, కార్పొరేటర్ సురేష్ జోషి పాల్గొన్నారు.
నాణ్యత పాటించాలి..
12వ డివిజన్లో జరుగుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేటర్ కావటి కవితతో కలిసి ఎమ్మెల్యే నరేందర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అధికారులు కూడా నిర్మాణ పనులను తరచూ పర్యవేక్షించాలని సూచించారు.