అదొక చిన్న మండల కేంద్రం. ఓ యువతి ఆ ఊరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా కొత్తగా బాధ్యతలు స్వీకరించింది. అదే రోజు వయసు పైబడిన ఓ మహిళ బ్యాంకుకు వచ్చింది. ఆమె బక్కచిక్కి ఉంది. ప్రస్తుతం తన వద్ద ఉన్న ఆవు సరిగా పాలు ఇవ్వడం లేదని, కొత్తగా ఒక ఆవు కొనుక్కోడానికి రుణం కావాలని మేనేజర్‌ను కోరింది. కొన్నిరోజులు ఆగి రమ్మని చెప్పింది మేనేజర్. వారం తర్వాత మళ్లీ వచ్చింది పెద్దావిడ. కాగితాలు నింపుతూ మేనేజర్ ‘పాల వ్యాపారం ద్వారా బాగానే గిట్టుబాటు అవుతుందా?’ అని ప్రశ్నించింది. తన కొడుకు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడని, అతనే తన బాగోగులు చూసుకుంటున్నాడని చెప్పింది మహిళ. ‘మరి పట్టణంలోని నీ కొడుకు దగ్గరికే వెళ్లిపోవచ్చు కదా’ అని ఆసక్తిగా అడిగింది మేనేజర్. తనకు ఊరు వదలి వెళ్లడం ఇష్టం లేదని బదులిచ్చింది ఆ మహిళ.
ఆవు కొనుక్కునే రోజు రానే వచ్చింది. అది మంచి ఎండాకాలం. బ్యాంకు వారు ఊరి మధ్యలో చిన్న షామియానా వేసి ఉన్నతాధికారుల సమక్షంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. షామియానా కిందకు వచ్చేటప్పుడు ఆవు మీద అప్పు తీసుకునే మహిళ ఎండకు తాళలేక కింద పడబోయింది. ఆమెను పట్టుకున్న మేనేజర్ ‘అసలే బలహీనంగా ఉన్నావు. చల్లగా కొడుకు దగ్గర ఉండవచ్చుకదా. ఈ పల్లెలో కష్టనష్టాలకు ఓర్చి ఆవునెందుకు సాదాలనుకుంటున్నావు? అసలు ఎందుకింత కష్టపడుతున్నావు?’ అని మళ్లీ అడిగింది.
వేదికకు పక్కనే ఉన్న శివాలయం చూపింది ఆ మహిళ. ‘ఆవును మేపి డబ్బు సంపాదించాలని లేదు నాకు. ఊహ తెలిసినప్పటినుంచి ఆ శివయ్య అభిషేకానికి రోజూ ఆవు పాలు అందిస్తున్నాను. నేను నా సుఖం కోరి పట్టణానికి వెళ్తే.. స్వామి వారి అభిషేకానికి నిత్యం పాలు అందివ్వలేను కదా! నా కట్టె కాలే వరకు స్వామి సేవ చేయాలని ఉంది నాకు’ అని చెప్పింది. ఆ మహిళ మాటలకు మేనేజర్ ‘హరహర మహాదేవ’ అంటూ ఆవు పగ్గాలు ఆమె చేతికిచ్చింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821