నమస్తే నెట్వర్క్, ఆగస్టు 16: వరాలిచ్చే తల్లి మహాలక్ష్మిని మహిళలు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. శ్రావణ రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలతోపాటు కుంకుమార్చన పూజలు చేశారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు ఇండ్లల్లో అమ్మ వారి చిత్రపటాలు, విగ్రహాలకు తీరొక్క నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఐష్టెశ్వర్యాలతో, అయురారోగ్యాలతో విలసిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు. సౌభాగ్యాన్ని ప్రసాదిస్తూ తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని వేడుకున్నారు. భూపాలపల్లిలోని శ్రీకృష్ణ గీతా మందిరం, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, వరంగల్లోని భద్రకాళి, హనుమకొండలోని వేయి స్తంభాల రుద్రేశ్వరాలయం, తదితర ఆలయాల్లో అర్చకులు మహిళలతో సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు చేయించారు.