భీమదేవరపల్లి, మార్చి 9 : యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వంగర ఎస్సై దివ్య పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ పంచాయతీ పరిధిలోని కరీంబాద్లో శనివారం రాత్రి జాగృతి పోలీస్ కళాజాత నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ , గుట్కా తదితర మత్తు పదార్థాల వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని వివరించారు. ఎవరైనా గంజాయి సేవించిన, గుట్కా అమ్మిన 8712584473 కు సమాచారం అందించాలని చెప్పారు. నేటి రోజుల్లో సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు ఉంటే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలన్నారు. అనంతరం డయల్ 100, బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు, విద్యా ప్రాధాన్యత, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంక్షేమం తదితర సామాజిక అంశాలపై కళాకారులు తమ ఆటపాటలు, నాటకాల ద్వారా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కళాజాత బృందం నాగమణి, విలియం వెంకటేశ్వర్లు, రత్నయ్య, పూల్ సింగ్, శ్రీనివాస్, విక్రం రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.