కాజీపేట, అక్టోబర్ 8 : ప్రస్తుతం రైల్వేశాఖ అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టారు. కాజీపేటలోని వ్యాగన్ వర్క్‌షాప్‌ను కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేసి అందులోనే వందేభారత్ కోచ్‌లను తయారు చేయాలని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి కేటాయించిన నిధులతో పాటు మరో రూ.66 కోట్లను అదనంగా మంజూరు చేసి, (కొత్త ప్రాజెక్ట్) టెస్ట్ షాప్ షెడ్‌ను నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం.
శరవేగంగా యూనిట్ నిర్మాణం..
కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలోని అ యోధ్యపురం వద్ద చేపట్టిన వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ షెడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్యపురంలో 160 ఎకరాల్లో రూ.521కోట్లతో నిర్మిస్తున్న ఈ యూనిట్ షెడ్డును కోచ్ షెడ్డుగా అప్‌గ్రేడ్ చేయాలని మరో రూ.361.79 కోట్ల నిధులను రైల్వేశాఖ మంజూరు చేసింది. పనులను ఆర్వీఎన్ఎల్ (రైల్వే వికాస్ నిగం లిమిటెడ్) కు అప్పగించగా, పవర్ మెక్ ప్రాజెక్టు సంస్థ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
2010-11 రైల్వే బడ్జెట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అయోధ్యపురంలో 55 ఎకరాల్లో వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్‌ను మంజూరు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రధానమంత్రి మోదీని ఎంపీలతో కలిసి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మోదీ ఏడాదిన్నర క్రితం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి వచ్చినప్పుడు కాజీపేట వ్యాగన్ రిపేరింగ్ వర్క్‌షాప్‌ను వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ పనులను ప్రారంభించారు.
ప్రస్తుతం అయోధ్యపురంలో 160 ఎకరాల్లోని సగభాగంలోనే నా లుగు షెడ్ల నిర్మాణ పనులు పుంజుకున్నాయి. ప్రతిరోజు 600 మంది కాంట్రాక్టు కార్మికులతో షెడ్లు, బిల్డింగ్లు, మెయిన్ లైన్, ఎనిమి ది సబ్ రైలు పట్టాల ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
మెయిన్ షెడ్, పెయింట్ బూత్ షెడ్, స్టోర్స్ వార్డు, టెస్ట్షాప్ షెడ్లలో కొన్ని పనులు పూర్తి కావచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, క్యాంటీన్, రెస్ట్ హౌస్ బిల్డింగ్‌ల నిర్మాణం జరుగుతున్న ది. షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో పనులు పూర్తి కావాల్సి ఉండగా, ఆగస్టు వర కు పూర్తి అవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణం పూర్తయితే రైల్వేలోని దాదాపు 20 నుంచి 30 రకాల వ్యాగన్ బోగీలు తయారు కానున్నాయి. ప్ర త్యేక్షంగా 4వేల మంది కార్మికులు, పరోక్షంగా మరో 4 వేల మదికి ఉపాధి దొరుకనున్నది.
కోచ్ ఫ్యాక్టరీకి రైల్వేశాఖ యత్నం?
వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థలంలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే శాఖ అంతర్గతంగా సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలంలో దాదాపు సగం స్థలం వృథాగానే ఉండనున్నది. కాగా, ఈ ప్రాంత ప్రజల 45 ఏళ్ల చిరకాల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అన్ని విధాలా బాగుంటుందని, ఎన్‌హెచ్ 163 సమీపంలోనే ఉండడంతో నిర్మాణ ఖర్చుల భారం తగ్గుతుందనే అంచనాతో రైల్వేశాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.