వాము ఆకులు: ఇరవై -ఇరవై అయిదు
బియ్యం: పెద్ద కప్పు
పచ్చి మిరపకాయలు: నాలుగైదు
జీడిపప్పు: అరకప్పు
కరివేపాకు: గుప్పెడు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
మిరియాల పొడి: పావు స్పూను
ఆవాలు, జీలకర్ర: అరస్పూను చొప్పున
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
ముందుగా బియ్యాన్ని కడిగి, అన్నం వండుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి మామూలు లేదా బాస్మతి బియ్యం ఉపయోగించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు నిలువుగా తరగాలి. కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. వాము ఆకును కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. జీడిపప్పులు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడనివ్వాలి.
అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, వాము ఆకులు కూడా జోడించి వేగనివ్వాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని బాణట్లో వేసి ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి. కాసేపు మూత బెడితే అన్నానికి వాము ఆకుల వాసన పడుతుంది. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, తరిగిన కొత్తిమీరలను అన్నం మీద వేసి కలిపితే… ఇక వడ్డించుకోవడమే తరువాయి.