జనగామ, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాకేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులతోపాటు విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, వసతిగృహంలో మరుగుదొడ్లు, వంట, పడక గదులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సమస్యలను గుర్తించారు.
హాస్టల్లో నెలకొన్న సమస్యలను రికార్డు చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ప్రధానంగా విద్యార్థుల హాజరు పట్టికలో అవకతవకలను గుర్తించారు. రికార్డుల ప్రకారం 110మంది విద్యార్థులు ఉండగా సోమవారం రాత్రి 73 మంది హాజరైనట్లు చూపించినా వాస్తవానికి కేవలం 60మందే హాజరైనట్లు తమ పరిశీలనలో వెల్లడైందని ఆయన తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మంగళవారం అరటి పండు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదనే విష యం విద్యార్థులను ఆరా తీస్తే తేలిందన్నారు.
కేయూ లా కాలేజీలో అడ్మిషన్లు నిలిపివేత
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 13: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా కాలేజీలో అడ్మిషన్లు నిలిపివేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కాషన్ మనీ అండ్ సెక్యూరిటీ డి పాజిట్ కింద కట్టాల్సిన ఫీజు కట్టని కారణంగా ప్రవేశాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ కాలేజీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. యేటా ప్రతి లా కాలేజీ ఆయా కోర్సుల ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీస్ ఫండ్ పేరు మీద కొంత మొత్తం కట్టాల్సి ఉంటుంది.
కాకతీయ యూనివర్సిటీ కూడా రూ.10 లక్షలు కట్టాల్సి ఉండగా, గడువు తేదీలోపల కట్టకపోవడంతో అడ్మిషన్లు నిలిపివేశారు. డ బ్బులు కట్టగానే పునరుద్ధరిస్తారు. ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ అధికారుల నిర్లక్ష్యమేనని ప్రొఫెసర్లు, ఉద్యోగులు, అధ్యాప కులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రూ.10 లక్షలు కట్టడానికి వీసీ అనుమతి లభించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా రూ.5 కోట్ల ఐటీ కట్టకపోవడంతో హైదరాబాద్ ఐటీ కమిషనర్ కేయూ అకౌంట్లను సీజ్ చేశారు. మళ్లీ డబ్బు లు కట్టడంతో పునరుద్ధరించారు.