హనుమకొండ చౌరస్తా, జులై 28: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఆగస్టు 1న హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్కు(ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనం) వద్ద జరిగే యూఎస్పీసీ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు నన్నెబోయిన తిరుపతి పిలుపునిచ్చారు. సోమవారం సుబేదారి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన యూఎస్పీసీ హనుమకొండ, వరంగల్ జిల్లాల స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 23న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేసి, ఈనెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అర్హతలేని డీఈఓలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ.శ్రీనివాసరెడ్డి, కడారి భోగేశ్వర్, పెండం రాజు, సుజన్ ప్రసాదరావు, కట్కూరి శ్రీనివాస్, ఊటుకూరి అశోక్, జి.ఉప్పలయ్య, ఆకుల గోవిందరావు, గోడిశాల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రాజయ్య, డి.మహేందర్‌రెడ్డి, గోవర్ధన్, జగన్మోహన్, మహేందర్‌రావు, ఏ.మల్లయ్య, బి.మహేందర్‌రావు పాల్గొన్నారు.