జనగామ, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఇప్పుడిప్పుడే మోస్తరుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది.. రిజర్వాయర్లలోకి నీటి విడుదల ప్రారంభమైంది. దీంతో ఆయకట్టు రైతులు వరినాట్లు వేయడం, పత్తి చేన్లలో కలుపుతీసి యూరియా వేయడం వంటి పను లు ముమ్మరం చేస్తున్నారు. దీంతో జిల్లా రైతాంగానికి ఎరువుల అవసరం ఇప్పుడే మొదలవ డంతో అమ్మకం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో పంట లు సాగవుతాయనే అంచనా మేరకు 26.26 వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ప డుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా అదనంగా 500 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
జి ల్లాకు అవసరమైన యూరియా పూర్తిస్థాయి లో రాకపోవడం.., ప్రస్తుత అవసరాలకు తగినంత సరఫరా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం పత్తి, మక్కజొన్న వంటి ఇతర పంటలకు తప్పనిసరిగా యూరియాను ఎరువుగా వేస్తేనే పంట దిగుబడి బాగుటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే వారం, పదిరోజుల్లో పంటల సాగు విస్తీ ర్ణం మరింత పెరిగి యూరియా వినియోగం పెరిగిపోయి నిల్వలు అడుగంటి కొరత తీవ్రమవుతుందనే ఆందోళన నెలకొన్నది.
ప్రస్తుతం స్టేషన్ఘనపూర్ కేంద్రంలో రైతుల రద్దీ, లైన్లో గందరగోళం, టోకెన్ల సమస్య, బస్తాల కొరత తీవ్రంగా ఉన్నది. స్టేషన్ఘనపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ కేంద్రం వద్ద మంగళవారం అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంటలతరబడి లైన్లో నిలబడిన మహిళా రైతు కళ్లు తిరిగి కిందపడిపోయి అస్వస్థతకు గు రైంది. అయితే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం నియోజకవర్గంలో యూరియా కొరత లేదని ప్రకటించడంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మంగళవారం ఒక్కరోజే క్యూ లైన్లో సుమారు 737 మంది రైతులు నిలబడి ఉండగా, అందుబాటులో ఉన్న బస్తా లు కేవలం 400 మాత్రమే కావడం గమనా ర్హం. ఎన్ని ఎకరాలున్నా ఒక రైతుకు ఒకే బస్తా ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొన్నది.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో యూరియా కొరతను ఒక రైతుగా స్వయంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చవిచూశారు. మంగళవారం ఆయన తన సతీమణి ఫాతిమా మేరీతో కలిసి రైతులతో కలసి లైన్లో నిలబడ్డారు. అయితే వారికి టోకెన్ వచ్చినప్పటికీ యూరియా బస్తాలు మాత్రం అందలేదు. మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉంటే సాధారణ రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతున్నది.. ‘మాకు టోకెన్ ఇచ్చి వారం రోజులైనా యూరియా ఇంకా అందలేదని..ఎప్పుడు వస్తుందో కూడా ఎవరూ చెప్పడం లేదు’ అని పలువురురైతులు మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు లైన్లో నిలబడి తీవ్ర ఇబ్బందిపడుతుంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం ని యోజకవర్గానికి దూరంగా ఉండి అబద్ధపు ప్రకటనలు చేస్తున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎ మ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తా రు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి యూరియా కొరతను తక్షణమే పరిషరించకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే పిరికి జ్వరంతో ఇంట్లో పడుకుంటే ఆయన కుమార్తె, వరంగల్ ఎంపీ కావ్య ఢిల్లీలో చకర్లు కొడుతున్నదని ఆరోపించారు. రాష్ర్టానికి సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇప్పటివరకు 5లక్షల మెట్రిక్ టన్నులు కూడా సరఫరా కాకపోవడం, కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి రైతులను మో సం చేస్తున్నాయని రాజయ్య ఆరోపించారు.