నమస్తే తెలంగాణ నెట్వర్క్: యూరియా మంట లు ఆరడం లేదు. పంటలు వేసిన రైతులకు ఆందోళనలు తప్పడం లేదు. తిండీ తిప్పలు మాని, వ్యవసాయ పనులు వదులుకొని ఎరువు కోసం పడరానిపాట్లు పడుతున్నారు. రోజలు గడుస్తున్న కొద్దీ సమస్య మరింత జఠిలమవుతున్నదే తప్పా.. పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని సొసైటీపై రైతులు మర్లబడ్డారు. సుమారు 200 మంది రైతులు టోకెన్లతో సొసైటీ వద్ద కు వచ్చారు. ఈ రోజు యూరియా ఇవ్వమని, రెండు రోజుల తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పి, వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా రైతుల కడుపు రగిలిపోయి సొసైటీ హాల్లోకి దూసుకెళ్లారు.
అక్కడే ఉన్న కొందరు మహిళలు సొసైటీ కేంద్రం వద్ద యూరియా లోడ్ దించుతున్న లారీపై రాళ్లు, కుర్చీలు విసిరారు. లారీ పైకి ఎక్కి బస్తాలు తీసుకెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్వయంగా సొసైటీ వద్దకు వచ్చారు. రైతులతో మాట్లాడారు. ఆధార్ కార్డ్ ఉన్న రైతుల అందరికీ యూరియా అందించేలా వ్యవసాయ అధికారులతో మాట్లాడి లైన్లో నిలబెట్టి యూరియా అందజేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని సొసైటీతో పాటు మరో రెండు కేంద్రాలకు యూరియా వస్తున్నదని తెలుసుకున్న రైతులు శనివారం తెల్లవారు జామున నుంచే ఆయా కేంద్రాలకు చేరుకొని చెప్పులు లైన్లో పెట్టారు. నెల్లికుదురులోని రైతు వేదిక వద్ద రైతులు కూపన్ల కోసం ఎగబడ్డారు. దీంతో జరిగిన తోపులాటలో భగ్నతండాకు చెందిన బానోత్ రమేశ్ చెయ్యికి తీవ్ర గాయమైంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఒక్కసారిగా రైతు వేదికలోకి దూసుకెళ్లడంతో సిబ్బంది కూపన్ల జారీని నిలిపివేశారు.
దీంతో లైన్లో నిలబడి ఓపిక నశించిన రైతులు సుమారు 500 మంది సొసైటీ కేంద్రం ఎదుట నెల్లికుదురు-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఏవో యాస్మిన్, తహసీల్దార్ నరేశ్, మండల ప్రత్యేకాధికారి మరియన్న ఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఎంతకు వినకపోవడంతో తొర్రూరు డీఎస్పీ కిశోర్కృష్ణ, సీఐ గణేశ్ బందోబస్తుతో వచ్చి రైతులతో మాట్లాడారు. శ్రీరామగిరి సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులు శ్రీరామగిరిలోనే యూరియా బస్తాలు తీసుకోవాలని, కేవలం నెల్లికుదురు సొసైటీ పరిధిలో రైతులు మాత్రం రైతు వేదిక వద్దకు వెళ్లి నిలబడాలని ఆదేశించారు. వారికి మాత్రమే యూరియా పంపిణీ చేశారు. కేవలం 400మంది రైతులకు మాత్రమే బస్తాలు దొరకకగా, సుమారు 600మంది నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద షాపు రైతుల మధ్య తోపులాట జరగడంతో షాపు యజమాని రైతులపై టోకెన్లు విసిరారు. గూడూరులో ఓ ప్రైవేటు దుకాణం ద్వారా యూరియా బస్తాలు ఇస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అయితే, ఉదయం వరకే యూరియా అయిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు దుకాణంపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇనుగుర్తి మండల కేంద్రంలోని సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో శనివారం రైతులు టోకెన్ల కోసం రైతు వేదిక వద్దకు భారీగా తరలివచ్చారు. అధికారులు టోకెన్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు కేసముద్రం, తొర్రూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తనకు వెంటనే యూరియా బస్తా అందించాలని తన చెప్పులతో తానే కొట్టుకొని నిరసన వ్యక్తం తెలిపాడు. మరిపెడ మండలంలో కొందరు డీలర్లు రైతులకు యూరియాను పం పిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సొసైటీల ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు.