బయ్యారం : రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ ( Urea distribution) పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల ( DAO Vijaya Nirmala) , డీఎస్పీ తిరుపతిరావు ( DSP Tirupati Rao) తెలిపారు. శుక్రవారం కొత్తపేట , బయ్యారంలో యూరియా పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడారు.
మహబూబాబాద్ జిల్లాలో 4.21 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పంటలు సాగు చేశారని తెలిపారు. సుమారు 40,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 29వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేశామని పేర్కొన్నారు. యూరియా కోసం రైతుల ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
పట్టా పుస్తకాలు లేని రైతులకు కూడా వారి వద్ద ఉన్న కాగితాల ఆధారంగా యూరియా ఇస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. మండలంలో యూరియా పంపిణీ పరిస్థితిని ఇన్చార్జి ఏవో రాజును అడిగి వివరాలు తెలుసుకున్నారు. యూరియా పంపిణీలో పోలీసులు అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, ఏఈవో నాగరాజు, తేజస్విని, ఫయాజ్ తదితరులున్నారు.