నర్సింహులపేట, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రం రాక ముందు యూరియా బస్తా కోసం రైతులు పడిన కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యూరియా బస్తాలు, విత్తనాల కోసం పోలీసు లాఠీలు దెబ్బతిన్న రైతన్నలకు మళ్లీ క్యూలో నిలబెట్టి కూపన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో యూరియా బస్తాలు దొరకకపోవ డంతో రైతులు 10 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సేవా కేంద్రానికి యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకొని బారులు తీరారు. రైతులను క్యూలో నిల్చోబెట్టి పోలీసులే కూపన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలో నిలబడేందుకు ఇబ్బంది పడిన వృద్ధులు కింద కూర్చుండి పోయారు. పీఏసీఎస్‌కు 444 యూరియా బస్తాలు రాగా, రైతుకు నాలుగు బస్తాలు ఇచ్చారు. నాలుగు ఎకరాలకు పైన వరి, మక్కజొన్న సాగు చేసిన రైతులకు 4 బస్తాల యూరియా సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి 4 ఎకరాలు వరినాటు పెట్టిన. యూరియా బస్తాల కో సం నాలుగు రోజులుగా తిరుగుతున్న. ఎప్పుడు చూసినా బస్తాలు తక్కువ వచ్చాయని చెబుతున్నారు. నిన్న బుధవారం వచ్చిన. చా లా మంది లైన్ల నిలబడి ఉన్నారు. రెండు బస్తాలు ఇచ్చినారు. మల్ల ఇవాల వచ్చి లైన్లో నిలబడితే పోలీసోళ్లు చిట్టి ఇచ్చిర్రు. చాల ఏళ్ల సంది వ్యవసాయ చేస్తున్న. 10 ఏళ్లలో ఇలాంటి ఇబ్బంది రాలేదు.
– గుండమల్ల వీరస్వామి, బొజ్జన్నపేట, నర్సింహులపేట