కమలాపూర్, మే 11 : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం నత్త నడకన కొనసాగుతున్నది. ఏడేండ్లుగా ప్రతి రోజు పనులు జరుగుతున్నప్పటికీ నిర్మా ణం మాత్రం పూర్తికావడం లేదు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఉప్పల్ వద్ద రూ. 70 కోట్లతో ఆర్వోబీ పనులు ప్రారంభించారు.
పరకాల-హుజారాబాద్ రహదారి నాలుగు లేన్ల హైవే కావడం, వాహనాల సంఖ్య పెరగడంతో రైల్వే గేటు కష్టాలు తప్పించేందుకు ఈ బ్రిడ్జికి శ్రీకారం చుట్టి ట్రాక్‌కు ఇరువైపులా పనులు పూర్తిచేశారు. రైల్వే లైన్ పై ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి పనులు నిలిచిపోయా యి. ఏండ్లు గడుస్తున్నా ఇవి పూర్తికాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర-దక్షిణ భారతదేశా న్ని కలిపే ప్రధాన మార్గం కావడంతో ఐదు రాష్ట్రాల నుంచి రైళ్లు ప్రయాణిస్తుంటాయి. మూడో లైన్ కూడా కొత్తగా వేయడంతో రైళ్ల సంఖ్య మరింత పెరిగింది. దీంతో గేటు పడితే అరగంటకు పైగా వేచి ఉండడం తో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.
నాలుగు జిల్లాలకు రాకపోకలు
హుజురాబాద్-పరకాల రహదారి గుండా కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తుంటారు. కరీంనగర్, వేములవాడ, కొండగట్టు, బాసర, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాలకు, మేడారం సమ్మక్క సారలమ్మ, టూరిజం ప్రాంతాలైన రామప్ప, లక్నవరానికి వెళ్తుంటారు. ఉప్పల్ రైల్వేగేటు పడిందంటే దాదాపు నాలుగు రైళ్లు పోయేవరకు తీయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆర్వోబీ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు విన్నవించినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ తన నియోజకవర్గంలోని ఈ సమస్యను పరిష్కరించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.