వర్ధన్నపేట, ఆగస్టు 10 : పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న వర్ధన్నపేట 30 పడకల కమ్యునిటీ హెల్త్ సెంటర్ 100 పడకల దవాఖానగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట సీహెచ్‌సీలో వసతులను మెరుగు పరిచింది. వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించడంతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. సీహెచ్‌సీ వర్ధన్నపేట మండలానికే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాయపర్తి, జఫర్‌గఢ్, పర్వతగిరి మండలాలకు చెందిన పేదలకు కూడా వైద్య సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే రమేశ్ సీహెచ్‌సీని 100 పడకల దవాఖానగా మార్చాలని నాలుగేళ్లుగా సీఎం కేసీఆర్‌తో పాటు ఆరోగ్యశాఖా మంత్రులను కోరుతున్నారు. అంతేకాక అధునాతన పరికరాలు, ఇతర వసతులు ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే కల్పించారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రసూతి వైద్యంలో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి వైద్యులు అనేక అవార్డులు అందుకున్నారు.
ఎమ్మెల్యేకు జీవో కాపీని అందించిన మంత్రి హరీశ్‌రావు
వర్ధన్నపేట సీహెచ్‌సీని 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు జీవో కాపీని గురువారం ఎమ్మెల్యే రమేశ్‌కు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు అందజేశారు. అలాగే దవాఖాన అభివృద్ధి, మెరుగైన అధునాతన పరికరాలను కొనుగోలు చేయడానికి రూ.26 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో రానున్న రోజుల్లో వర్ధన్నపేట సీహెచ్‌సీలో పేదలకు అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రస్తుతం ప్రసూతి వైద్యంలో ముందంజలో ఉన్న సీహెచ్‌సీ రానున్న రోజుల్లో పేదలకు అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు అందనుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 100 పడకల దవాఖానగా మారుస్తున్నట్లు జీవో జారీ చేసి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఎమ్మెల్యే రమేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే వర్ధన్నపేట ప్రజల చిరకాల వాంఛ సీహెచ్‌సీని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయించిన ఎమ్మెల్యే రమేశ్‌కు మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అరూరి చిత్రపటాలకు పాలాభిషేకం
వర్ధన్నపేట : సీహెచ్‌సీని 100 పడకల దవాఖానగా అప్‌గ్రేడ్ చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు గురువారం ఆసుపత్రి ఆవరణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఏ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జీవో జారీ చేసి నిధులు మంజూరు చేయడంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో సీహెచ్‌సీలో ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య పరీక్షలు అందనున్నాయన్నారు. ఇందుకోసం విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే రమేశ్‌కు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఎలేందర్‌రెడ్డి, మోహన్‌రావు, కుమారస్వామి, యాకయ్య, సంపత్‌రెడ్డి, సోమయ్య, పులి శ్రీను, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.