ఇనుగుర్తి, జూన్ 3 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికే దార్శనికుడని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహకారంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళల కోలాటాలు, ఆట పాటల నడుమ వేల మంది అంబేద్కర్వాదులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇనుగుర్తి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వద్దిరాజు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని, దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఆయన అందరివాడని అన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోలియం, సహజ వాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడిగా వివిధ చమురు సంస్థల నుంచి రూ. 7 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇనుగుర్తి ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు యత్నిస్తుంటే కలెక్టర్ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడాలని, అలాగే తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఆయన నరేందర్రెడిని కోరారు. అనంతరం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతని, ఆయన ఆశయాలు కొనసాగించాలన్నారు. ఇనుగుర్తి మండలానికి కార్యాలయాలు, కళాశాలలు మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ మాట్లాడుతూ పార్లమెంట్లో రాజ్యాంగంపై కుట్రలు, దాడులు జరుగుతున్నాయని, అవి పేదల మీద జరిగే దాడులని, వాటిని ఆపేయాలని కోరారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే గొప్ప నినాదం ఇచ్చిన మహాన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతలు విధించొద్దని, విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన కోరారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన పసునూరి జంపయ్య అంబేద్కర్‌పై రాసిన పాట సీడీని రవిచంద్ర, ప్రవీణ్‌కుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, వద్దిరాజు కిషన్, దేవేందర్, వెంకన్న, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిప్పలపల్లి ఐలయ్య, జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరుడు సామేల్, రాష్ట్ర కార్యదర్శి పాలమాకుల జితేందర్ తదితరులు పాల్గొన్నారు.