జనగామ, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : పెద్ద దిక్కును కోల్పోయన రైతు కుటుంబం ఆగం కావొద్దన్న ఉద్దేశంతో నాటి సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని తెచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించి ఆర్ధిక ధీమా కల్పించారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకానికి 2018 ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు 14 వరకు బీమా ప్రీమియం సొమ్ములు చెల్లించడంతో ఆగస్టు 15 నుంచి పాలసీ ఫోర్స్లో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ సంస్థకు ప్రతి ఆరు నెలలకోసారి ప్రీమియం డబ్బులు చెల్లిస్తూ వస్తున్నది. అంతకు ముందు బీమా చెల్లింపులో జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వ తీరువల్ల పాలసీ ఫోర్స్(అమలులో) లేదనే కారణంతో అన్ని పత్రాలు ఆన్లైన్ చేసినా మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందలేదు.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మరణించిన ఏ ఒక్క రైతు కుటుంబానికి బీమా సొమ్ము అందకపోగా, ఈనెల 13వ తేదీతో రైతు బీమా రెన్యువల్ గడువు ముగిసినా ప్రభుత్వం ఇన్సూరెన్స్ సంస్థకు డబ్బులు చెల్లించలేదు. దీంతో ఇప్పటి నుంచి మరణించిన రైతులకు బీమా వర్తిస్తుందా? కుటుంబాలకు పరిహారం అందుతుందా? కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ పథకం అమలవుతుందా? రైతుబీమాకు రాంరాం చెబుతారా? అన్న సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి. రెన్యువల్ గడువు ముగిసి 10 రోజులు కావాస్తున్నా స్పష్టత లేకపోవడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే రైతు బీమా స్థానంలో ఇందిరమ్మ కుటుంబ బీమా తీసుకురానున్నారనే ప్రచారం జరుగుతున్నది.
గతంలో తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల కుటుంబ బీమా చేయించనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించి ఇప్పటి వరకూ ఆ ఊసెత్తడంలేదు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బీమా పథకానికి శ్రీకారం చుడితే తెల్లకార్డులున్న రైతులకు మాత్రమే బీమా వర్తించే అవకాశం ఉంటుంది. తెల్లకార్డులు లేని రైతులకు సర్కార్ పంగనామాలు పెట్టబోతున్నదనే ప్రచారం జరుగుతున్నది. జనగామ జిల్లాలో రైతు బీమాకు అర్హులైన 1,99,000 మంది రైతులున్నారు. 2018 నుంచి 2023 వరకు మరణించిన 4,471 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ. 223 కోట్ల బీమా సొమ్ము చెల్లించారు.
2018లో 378 మంది రైతు కుటుంబాలకు రూ. 18.90 కోట్లు, 2019లో 457 మందికి రూ. 22.90 కోట్లు, 2020లో 690 మందికి రూ. 34.50 కోట్లు, 2021లో 554 మందికి రూ. 27.70 కోట్లు, 2022లో 581మందికి రూ. 29.05 కోట్లు, 2023లో 610 మందికి రూ.30.50 కోట్లు బీమా సంస్థ చెల్లించింది. 2024లో 539 మంది రైతులకు రైతుబీమా పథకం కింద రూ. 26.95 కోట్లు చెల్లించారు. ములుగు జిల్లాలో 41,013 రైతులుండగా, 2018 నుంచి ఇప్పటి వరకు చనిపోయిన 1,853 మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించగా, ఇంకా 21 మందికి బీమా సొమ్ము అందలేదు. వరంగల్ జిల్లాలో 1,46,057 మంది రైతులుండగా, 2025-26లో చనిపోయిన 506 మంది రైతు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, ఇందు 482 మందికి పరిహారం అందింది.
ఇంకా 24 మందికి పెండింగ్లో ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 1,46,000 మంది రైతులల్లో 825 మంది మరణిస్తే 715 మందికి 2025-26లో రూ. 34 కోట్ల బీమా సొమ్ము అందగా ఇంకా 110 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,17,178 మంది రైతులకు 2018 నుంచి 2025 వరకు మరణించిన 2,738 మంది రైతు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే అందులో 2,685 మందికి పరిహారం అందింది. మిగిలిన వారికి ఇంకా అందాల్సి ఉంది. హనుమకొండ జిల్లాలో 90,765 మంది రైతు కుటుంబాలు ప్రస్తుతం బీమాకు దూరమయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల మరణించిన రైతు కుటుంబాలకు ఆరు నెలలుగా బీమా డబ్బులు అందడంలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమాకు అవసరమైన ప్రీమియం డబ్బులు సకాలంలో ఇన్సూరెన్స్ సంస్థలకు చెల్లించకపోవడంతోనే బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యం జరుగుతున్నదని సమాచారం. గత ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రైతుబీమా సాయం అందలేదు. దీంతో జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో రైతు బీమాకు అర్హత ఉండి, అకాల మరణం చెందిన వేలాది మంది రైతు కుటుంబాలు బీమా డబ్బుల ఎదురుచూస్తున్నాయి.
ఇందులో కొంత మంది రైతులకు సంబంధించిన ధ్రువపత్రాలు ఏఈవోలు ఆన్లైన్లో నమోదు చేయలేదు. మరికొందరి దరఖాస్తులు వ్యవసాయశాఖ నోడల్ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. కాగా అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ రైతు కుటుంబాలకు రావాల్సిన బీమా డబ్బులు విడుదల చేయడంలో ఇన్సూరెన్స్ సంస్థ ఎందుకు జాప్యం చేస్తున్నదో తెలియదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతు బీమా విషయంలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.