Online Courses | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 10 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వయం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ పోస్టర్లను బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్స్లో విద్యార్థులు, అధ్యాపకులు ఎవరైనా తమకు నచ్చిన కోర్సుల్లో జాయిన్ కావచ్చని, ఈ కోర్సులు అభ్యసించడం వలన డిగ్రీతో పాటు అదనంగా క్రెడిట్ పాయింట్స్ పొందడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ సర్టిఫికెట్ పొందిన అధ్యాపకులుగాని, విద్యార్థులుగాని వివిధ ఉద్యోగ ఇంటర్వ్యూలలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. కాలేజీ విద్యార్థులు ఆన్లైన్ కోర్సులు ఎక్కువ శాతం జాయిన్ కావాలని ఆమె కోరారు. అదేవిధంగా కాలేజీలో వివిధ విభాగాల ఆధ్వర్యంలో స్టూడెంట్ క్లబ్లను ఏర్పాటు చేసి, వివిధ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని, సబ్జెక్టువారిగా 20 మంది విద్యార్థులతో స్టూడెంట్ క్లబ్ ఏర్పాటు చేసి, దీని ద్వారా ఎడ్యుకేషనల్, సోషల్ సర్వీస్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందుతుందన్నారు.
నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ (న్యాక్)లో మార్కులు ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ రెహ్మాన్, కేయూ ఐక్యూఏసీ సభ్యులు వెంకటేశ్వరరావు, కళాశాల విభాగాధిపతులు పాల్గొన్నారు.