మరిపెడ : జాతీయ రహదారి 365 పై రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన మరిపెడ పురపాలక సంఘం పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన చోటుకు మరిపెడ ఎస్ఐలు బి సతీష్, అంజమ్మ చేరుకొని మృతి చెందిన ఇద్దరి యువకులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుని 108 లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వివరాలకు వెళ్తే.. మండలంలోని బావోజి గూడెం గ్రామ శివారు పెంకురారం తండాకు చెందిన భూక్య సంతోష్(19) భోజ్య తండాకు చెందిన గుగులోతు కార్తీక్(22) పని నిమిత్తం మరిపెడకు మృతులిద్దరూ పల్సర్ బైక్ పై వస్తున్న క్రమంలో వాగు ఒడ్డుకు తండాకు చెందిన అజ్మీర సుధీర్ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ముందు బైకును ఢీకొనడంతో ఇద్దరికీ తలలకు బలంగా దెబ్బలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.