వరి పొలంలో పనులు చేసేందుకు వచ్చిన కూలీలపైకి లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అదుపు తప్పి తమవైపే వేగంగా వస్తున్న వాహనం నుంచి తప్పించుకు నేందుకు పరుగు తీసినా అందులోని పత్తి గింజల బస్తాలు మీద పడి ఊపిరాడకుండా చేశాయి. ఊహించని ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(టీ)లో జరుగగా, వరుసకు అత్తాకోడళ్లు అయిన మోకిడి పూలమ్మ(51), మోకిడి సంధ్య(30) మృతిచెందారు. రోడ్డు వైపు వెళ్లిన ఆరుగురికి ప్రాణాపాయం తప్పగా ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
టేకుమట్ల, మార్చి 25 : అతివేగంతో వచ్చిన ఓ లారీ వరి పొలంలో పనిచేస్తున్న మహిళా కూలీలపై బోల్తా పడడంతో అకడికకడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకృష్ణాపూర్(టీ) గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జరిగింది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణపూర్(టి)కి చెందిన మోకిడి పూలమ్మ(51), మోకిడి సంధ్య(30) మరికొంత మంది కూలీలలో కలిసి మేల్ ఫిమేల్ వరి పంటలో బెరుకులు/కలుతులు ఏరేందుకు వెళ్లారు.
పొలంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చిట్యాల మండలం శాంతినగర్ సమీప పత్తి మిల్లు నుంచి పత్తి గింజల లోడ్‌తో టేకుమట్ల వైపు వస్తున్న లారీ మూలమలుపు వద్ద వేగంగా వస్తూ అదుపు తప్పింది. వాహనం వేగంగా దూసుకురావడాన్ని గమనించి ఆరుగురు కూలీలు రోడ్డుపైకి పరుగెత్తగా ఇద్దరు మహిళలు పొలంలోకి దిగారు. లారీ కూడా అక్కడే ఒడ్డున ఉన్న చెట్టును ఢీకొనడం పొలంలోకి రావడంతో పత్తి గింజల బస్తాలు పూలమ్మ, సంధ్యపై పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, యంత్రాలతో లారీని పకకు తీయించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికి తీసి చిట్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. లారీ డ్రైవర్ కొత్తూరు వినోద్ పరారు కాగా, అతడిది చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామమని స్థానికులు తెలిపారు.
సంధ్యకు ఒక బాబు నిత్విన్, ఒక పాప శ్రియాన్షి ఉండగా, పూలమ్మకు ఒక కుమారుడు, మానసిక దివ్యాంగురాలైన కూతురు ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లోని పిల్లలకు తల్లులు దూరమయ్యారు. తోటి కూలీలు తమ కండ్లముందే మృతిచెందడం చూసి వాళ్లంతా షాక్‌కు గురై కన్నీటి పర్యంతమయ్యారు. రోజూ కూలి పనికి వెళ్లి బతికే ఆ రెండు కుటుంబాల్లో ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. తల్లులు దూరమై వారి పిల్లలు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ప్రమాదానికి కారణమైన లారీ ఓనర్, డ్రైవర్‌పై చర్యలు తీసుకొని మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.