యూరియా రైతుల ప్రాణాలు తీసింది. పంటలు ఎండిపో తున్నాయని వెళ్లిన వారికి జీవితమే లేకుం డా చేసింది. ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో ఆదివారం పొద్దున్నే యూరియా కోసం బయలుదేరిన ఇద్దరు రైతులను రోడ్డు ప్రమాదం బలిగొన్నది. వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చి రోడ్డున పడేసింది. ఈ హృదయ విదారకర ఘటన గూడూరు మండలం జగన్నా యకుల గూడెం వద్ద ఎన్‌హెచ్-365పై చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, పార్టీ నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
గూడూరు, సెప్టెంబర్14 : యూరియా కోసం వెళ్తుండగా గూడూరు మండలం జగన్నాయకుల గూ డెం వద్ద ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మండలంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బగూడెం గ్రామానికి చెందిన బానోత్ లాల్య (77), జోషి తండాకు చెందిన ధరావత్ వీరన్న(46)లు సమీప గ్రామమైన బొద్దుగొండ రైతు వేదిక వద్ద యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై జగన్నాయకులగూడెం క్రాస్‌రోడ్‌కు సమీపంలో మహబూబాబాద్ నుంచి గూడూరు వైపునకు వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బానోత్ లాల్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు.
తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య ఉన్న వీరన్నను వెంటనే పోలీసులు మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు లాల్య భార్య ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన డ్రైవర్ చొక్కలింగంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దుబ్బగూడెం గ్రామానికి బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, బీఆర్ఎస్ పార్టీ మండల బాధ్యులు సంపత్‌రావు, ఆరె వీరన్న, నూకల సురేందర్, రహీం, కఠార్‌సింగ్,మోహన్, సుధాకర్‌రావు వెళ్లి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.