నల్లబెల్లి, మార్చి 11 : వేరు వేరు కారణాలతో ఓకే రోజు ఇద్దరు వ్యక్తులు మరణించడంతో నారక్క పేట( Narakkapet) గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన మాజీ ఫ్యాక్స్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుపాకుల ప్రసాద్ (58) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో క్రిమిసంహారక మందు సేవించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ప్రసాద్ మృతి చెందాడు. మృతుడికి భార్య సుగుణ ముగ్గురు కుమార్తెలు కుమారుడు ఉన్నారు.
ఇదిలా ఉంటే ఇదే గ్రామానికి చెందిన మాడుగుల అజయ్ (23) అనే యువకుడు తన తోటి మిత్రుడు జన్ను అజయ్ తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ మండలంలోని బజ్జు తండా బస్టాప్ వద్ద జాతీయ రహదారిపైకి వాహనాన్ని తీస్తుండగా ఇదే క్రమంలో నర్సంపేట నుండి మల్లంపల్లి వైపు అతివేగంగా వస్తున్న ఇరువురు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో మాడుగుల అజయ్ అక్కడికక్కడే మృతిచెందగా జన్ను అజయ్ తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానిక ఎస్ఐ గోవర్ధన్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాల పాలైన యువకుడు అజయ్ తో పాటు కారు డ్రైవర్ ను చికిత్స నిమిత్తం108 నర్సంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. అజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటలోని మార్చురీకి తరలించారు.