నల్లగొండ, మార్చి 18 : పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూలమని, ప్రభుత్వ చేయూత, నూతన సాంకేతికతతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. బుధవారం కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం కేంద్రాన్ని అయన సందర్శించారు. పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగపడే భూములు, విస్తీర్ణం, పెట్టుబడి ఖర్చు, వాతావరణ అనుకూలత, కూలీలు తదితర వివరాలను రైతు పుండరీకంను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పట్టు పురుగుల పెంపకం రైతు మాట్లాడుతూ.. పట్టు పురుగుల పెంపకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని, ఒక ఎకరాకు పెట్టుబడి రూ.8 లక్షల నుండి 10 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం 8 పంటలు తీయవచ్చని, ఒక పంటకు రూ.లక్ష నుండి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చిన సందర్భాలు ఉన్నట్లు చెప్పారు. తాను రెండు ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకం చేపట్టడం జరిగిందని, 2017లో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించి ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం 50% , రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇస్తుందని, రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుందన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పట్టుపురుగుల పెంపకానికి ఆసక్తి ఉన్న రైతులను ప్రోత్సహించాలని, ఏప్రిల్ 2న గ్రామాలలో నిర్వహించే ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక గ్రామసభలలో పట్టుపురుగుల తోటల పెంపకానికి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో ఆయిల్ పామ్, పట్టు పురుగుల పెంపకానికి రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ డిడి సుభాషిని, హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి, నరసింహపురం సర్పంచ్ రాజేశ్వరి, ఇతర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

పట్టు పురుగుల పెంపకంతో రైతులకు లాభాలు : కలెక్టర్ చంద్రశేఖర్