కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండేళ్లు కీలక శాఖలకు మంత్రిగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల.. ఆ పార్టీకి ‘చెయ్యి’చ్చారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రెండు పేజీల లేఖ రాసి, హస్తం పార్టీతో ఉన్న సుమారు నాలుగు దశాబ్దాల బంధానికి శుక్రవారం తెగదెంపులు చేసుకున్నారు. ‘సీనియర్లకు గౌరవం లేదు.. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం లేదు.. సునీల్ కనుగోలుతో దొంగసర్వేలు చేయించి భూములు, విల్లాలు, కోట్లు ముట్టజెప్పే వారికే టికెట్లు ఇస్తున్న తీరు ఎంతో ఆవేదన కలిగించింది.. అందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నా’ అని ప్రకటించారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ శేణుల్లో ఒక్కసారిగా అయోమయం నెలకొనగా, ఆ పార్టీలో బీసీలకు గుర్తింపు లేదన్న విషయం మరోమారు బయటపడిందని ‘హస్తం’ నేతలే పేర్కొంటున్నారు.
– వరంగల్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు వ్యతిరేకమని మరోసారి స్పష్టమైంది. బడుగు బలహీన వర్గాల వారికి చట్టసభల్లో అవకాశాలు కల్పించే విషయంలో హస్తం పార్టీ అసలు వైఖరి తెలిసిపోయింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ అసలు తీరు అందరికీ అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని పొన్నాల లక్ష్మయ్య పదేపదే డిమాండ్ చేస్తున్నారు. కాం గ్రెస్ అధిష్టానం ఎంతకీ పట్టించుకోవడంలేదు. హస్తం పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడంతో పొన్నాల కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వర్గాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటున్నది. పీసీసీలో, ఇతర పార్టీ కమిటీల్లో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ వస్తున్నది.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపులోనూ ఇదే తరహా చర్యలు చేపడుతున్నది. ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు దరఖాస్తు చేసుకోవాలని, ఇలా చేస్తేనే అభ్యర్థిత్వం కోసం పేరు పరిశీలిస్తామని చెప్పింది. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పట్టించుకోకుండా అభ్యర్థిత్వాల ఖరారుపై దృష్టి పెట్టింది. ఇతర పార్టీల్లోని వారికి, ముఖ్యంగా బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేలా పీసీసీ నాయక త్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో స్థానానికి ము గ్గురు చొప్పున పేర్లను పీసీసీ నాయకత్వం కాంగ్రెస్ అధిష్టానానికి పంచించింది. ఈ ప్రక్రియలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించే విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోని వారి పేర్లను ప్రతిపాదనల్లో పొందుపరిచింది. ఈ విషయంపై బీసీ వర్గానికి చెందిన నాయకులు తీవ్రం గా స్పందించారు.
ఏఐసీసీ నాయకత్వం ఓ వైపు బీసీ గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంటే, పీసీసీ నాయకత్వం రాష్ట్రంలో బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నదని ఈ వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేపదే ఈ విషయాన్ని పీసీసీకి, ఏఐసీసీకి విన్నవించారు. బీసీ వర్గాల నేతల విన్నపాలను, ప్రతిపాదనలను పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టికెట్ల ఖరారుపై నిర్ణయాలు తీసుకునే పనిలో నిమగ్నమైంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌లోని బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత పొన్నాల ఆ పార్టీకి రాజీనామా చేశారు.
నాలుగు దశాబ్దాల అనుబంధం..
పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్నది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, 12 ఏండ్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో పొన్నాల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇంతటి సీనియర్ నేతను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అన్యా యం చేస్తూ వచ్చిందన్న అభిప్రాయాలున్నాయి. పొన్నాలతోపాటు బీసీ వర్గంలోని ముఖ్యనేతలను కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై కాంగ్రెస్‌లో ఇటీవల ఎక్కువ చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌కు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తాజా నిర్ణయం ప్రభావం ఆ పార్టీకి ప్రతికూలంగా మారనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పొన్నాలకు కాంగ్రెస్లోజరిగిన అవమానంపై బీసీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పార్టీ కోసం ఎంతో చేసిన పొన్నాలను, ఇతర బీసీ నేతలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయడం సరికాదని ఈ వర్గాలు అంటున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా లో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉన్న ఐదు స్థానాలు మినహా మిగిలిన ఏడు సీట్లలో మూడు స్థానాలను కాంగ్రెస్ గతంలో బీసీలకు కేటాయించేది. ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నుంచి ఒక్క బీసీకి కూడా టికెట్ కేటాయించే పరిస్థితి లేకపోవడం దారుణమైన విషయమని బీసీ నేత లు చెబుతున్నారు. బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేని కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని అంటున్నారు.
అదేబాటలో మరికొందరు..
బీసీల వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్న కాంగ్రెస్ తీరుపై ఆ పార్టీలోని ఈ వర్గానికి చెందిన ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడు పొన్నాల తరహాలోనే మరికొందరు నేతలు తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై వీరంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు సైతం పొన్నాల తరహాలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాజీనామాల రూపంలో ఆ పార్టీకి మరిన్ని గట్టి దెబ్బలు తప్పవని బీసీ నేతలు చెబుతున్నారు.