వరంగల్ చౌరస్తా, మే 27: ఇంటి తాళాలు బద్దలుకొట్టి దొంగతనం చేసిన కేసులో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ వందిరాం నాయక్ నిందితుల వివరాలను వెల్లడించారు. మే 11వ తేదీన కొత్తవాడ శాంతినగర్ ప్రాంతంలో తాళం వేసివున్న భయ్య స్వామి ఇంటిలో 9తులాల బంగారు అభరణాలతో పాటుగా వెయ్యి రూపాయల నగదు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందిందన్నారు. ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలు, సాక్షాల ఆధారంగా మధ్య ప్రదేశ్లో నివాసం ఉంటున్న వెంకట్రామ గోద్యారే (40), మహారాష్ట్ర యావత్నాల్ జిల్లా షెరాలీ సయ్యద్ మోతీ (రహీమ్) (24)లు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు.
పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, సుమారు 8 లక్షల పదివేల విలువ కలిగిన తులాల బంగారు ఆభరణాలను స్వాధీన పరచుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులు ఇద్దరికి క్రిమినల్ హిస్టర్ ఉందని అన్నారు. తక్కువ సమయంలోనే ఈ కేసును ఛేందించిన ఇన్స్పెక్టర్ తుమ్మ గోప, ఎస్ఐ నవీన్ కుమార్, టీం సభ్యులు హరికాంత్, మీర్ అక్మూద్ అలీ, రాజేష్, మ్మూర్ సల్మాన్ పాషా, నాగేష్ రెడ్డి, ప్రవీణ్ ను అయన అభినందించారు.