ములుగురూరల్, మే 12 : ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లావాసి స్వామి, మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన నీలయ్య ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో కన్ను, నోటికి తీవ్ర గాయాలయ్యాయి. నీలయ్య సైతం అస్వస్థతకు గురి కాగా అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఇద్దరినీ ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యం అందించారు.
వారం రోజుల నుంచి తనకు తీవ్ర జ్వరం ఉన్నదని తాను విధులకు హాజరు కాలేనని అధికారులకు తెలుపగా ఏటూరునాగారంలో విధులు నిర్వర్తించాలని అన్నారని నీలయ్య తెలిపారు. లేకుంటే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారని, చేసేదేమీ లేక విధులకు హాజరయ్యేందుకు రాగా కళ్లు తిరిగి పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలు అవుతున్నాయని కంటతడిపెట్టారు. కాళ్లు మొక్కుతా, దండం పెడుతా తనను ఇంటికి పంపించండి అంటూ మీడియా ద్వారా నీలయ్య ఉన్నతాధికారులను వేడుకున్నాడు.